MARRIAGE: ఎట్ట‌కేల‌కు మూడుముళ్ల బంధంతో ఒక్క‌టైన విష్ణు విశాల్- గుత్తా.. వైర‌ల్‌గా పెళ్లి ఫొటోలు

గ‌త ఏడాది క‌రోనా విల‌య‌తాండవం చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పెళ్లి పీట‌లెక్కారు. ఇక ఈ ఏడాది ప్ర‌ముఖ భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల‌, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ పెళ్లి చేసుకున్నారు. గురువారం( ఏప్రిల్ 22) మధ్యాహ్నాం 1.40 గంట‌ల‌కు వీరి వివాహం జ‌రిగింది. క‌రోనా వ‌ల‌న కేవ‌లం బంధువులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే పెళ్లి వేడుకకు హాజ‌ర‌య్యారు. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం జ‌రుపుకున్న ఈ జంట గురువారం హైద‌రాబాద్‌లోని మొయినాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు.

దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నటువంటి గుత్తా జ్వాల‌- విష్ణు విశాల్ ఏడాది క్రితమే వారి ప్రేమను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఒక‌రిపై ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉంద‌ని తెలియ‌జేశారు. త‌మ ప్రేమ‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి గుత్తా జ్వాల‌- విష్ణు విశాల్ హాయిగా చెట్టా ప‌ట్టాలు వేసుకుంటూ తిరిగారు. విహార యాత్ర‌ల‌కు వెళ్లారు. వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఈ జంట సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్ చేసిన విష్ణు పెళ్లికి కొంత మందినే ఆహ్వానిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.

ఏప్రిల్ 22న త‌మ పెళ్లి తేది అని ప్ర‌క‌టించిన ఈ జంట రెండు రోజులుగా వారి ప్రైవేట్ ఎంగేజ్మెంట్ మెహెంది, హల్దీ లాంటి వేడుకలలో సంద‌డి చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కపుల్ మ్యారేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ నూతన దంపతులకు అటు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నుండి ఇటు ప్రొఫెషన్ ఇండస్ట్రీ నుండి భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కాగా, విష్ణు విశాల్‌ 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకొని, కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్ గుత్తా జ్వాల‌..‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకోగా, 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప్రేమ ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది.

Advertisement