Virata Parvam: దృశ్యం2, విరాట ప‌ర్వం కూడా ఓటీటీలోనే.. ఇందులో నిజ‌మెంత‌?

Virata Parvam: థియేటర్స్ మూత పడటం.. కరోనా ఇంకా భయపెడుతుండటంతో సినిమాలు ఎలా విడుదల చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు నిర్మాతలు. కొందరు అగ్ర నిర్మాతలు మాత్రం మంచి రోజుల కోసం వేచి చూస్తున్నారు. నాని లాంటి హీరోలు అయితే ఎన్ని రోజులైనా వేచి చూస్తాం కానీ థియేటర్స్ కాకుండా ఓటిటిలో తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు.

మరోవైపు అగ్ర హీరోలు కూడా తమ సినిమాలను అలాగే బాక్సుల్లోనే దాచేసారు. ఈ క్రమంలోనే వెంకటేష్ నటించిన నారప్ప అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది. అలాగే ఆయన నటించిన మరో సినిమా దృశ్యం 2 కూడా ఓటిటిలోనే విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాత సురేష్ బాబు స్పందించాడు.

ఈ సినిమాకు పూర్తి నిర్మాత సురేష్ బాబు మాత్రమే కాదు.. మరో నిర్మాణ సంస్థతో కలిసి ఈయన దృశ్యం 2 నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. నారప్ప సినిమాను కూడా కళైపులి ఎస్ థానుతో కలిసి నిర్మించాడు సురేష్ బాబు. అయితే మేజర్ షేర్ ఈయనదే కావడంతో ఓటిటి రిలీజ్ పై నిర్ణయం తీసుకున్నాడు. కానీ దృశ్యం 2 విషయంలో అలా కాదంటున్నాడు సురేష్ బాబు.

ఈ సినిమాను ఎలా విడుదల చేస్తారు అనేది పూర్తిగా నిర్మాతలకే వదిలేస్తున్నట్లు తెలిపాడు. దాన్ని ఓటిటికే ఇచ్చేయాలనుకుంటే ఓకే.. అందులో అభ్యంతరాలు లేవంటున్నాడు. ఎందుకంటే మలయాళం దృశ్యం 2 కూడా నేరుగా ఓటిటిలోనే వచ్చింది. విజయం కూడా సాధించింది. తెలుగు వర్షన్ కూడా అక్కడే విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్పాడు సురేష్ బాబు.

అయితే విరాట పర్వం సినిమా విషయంలో మాత్రం అలాంటి నిర్ణయాలేం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. పైగా ఇంకా షూటింగ్ 5 రోజులు బ్యాలెన్స్ ఉందని కూడా చెప్పాడు. అది అయిపోయిన తర్వాతే ఈ చిత్ర విడుదలపై క్లారిటీ వస్తుందని చెప్పాడు సురేష్ బాబు. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. మ్యాగ్జిమమ్ థియేటర్స్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు ఈ నిర్మాత. మొత్తానికి ఈ రెండు సినిమాల విడుదలపై కొన్ని రోజులుగా ఉన్న కన్ఫ్యూజన్ కు తెర దించేసాడు సురేష్ బాబు.