Virat Kohli: రోహిత్‌కి నాకు గొడ‌వ‌లు పెట్టొద్దు.. మీడియాపై ఫైర్ అయిన కోహ్లీ

Virat Kohli: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో దాయాది పాకిస్థాన్ చేతిలో భార‌త్ దారుణ‌మైన ప‌రాజ‌యం చ‌వి చూసిన విష‌యం తెలిసిందే. ఈ ఓట‌మితో టీమిండియాపై భారీగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఐసీసీ ప్రపంచకప్‌లలో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు కాగా.. 10 వికెట్ల తేడాతో గెలవడం కూడా ఇదే మొదటిసారి.

virat kohli

బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దారుణ ఓటమి తర్వాత జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మెయిన్ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుతిరిగాడు.

పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న లోకేష్ రాహుల్.. ఒక పరుగు మాత్రమే తీశాడు. అనంతరం తాను ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన రోహిత్.. అసలు సమరంలో మాత్రం తేలిపోయాడు.

మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జవాబిచ్చాడు. ఈ సమయంలో ఓ రిపోర్టర్ కోహ్లీకి కఠినమైన ప్రశ్న వేశాడు. ‘రోహిత్ శర్మ చాలా పేలవంగా ఆడాడు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే బాగుండేది. మీరు ఏమంటారు?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కోహ్లీ మొదట షాకయినా.. అనంతరం రిపోర్టర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ‘మీరు చాలా ధైర్యంగా ప్రశ్నించారు.

కానీ ఇది అవసరం లేని, అడగాల్సిన ప్రశ్న మాత్రం కాదు. మీకు ఏదైనా కాంట్రవర్సీ కావాలంటే నాకు ముందుగానే చెప్పండి. దానికి అనుగుణంగా సమాధానం ఇస్తాను. అంతేకానీ ఇలా అడిగితే నేనేమీ చెప్పలేను. వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడింది చూడలేదా?’ అని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.

మొదట బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్‌ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు. ఇంకా మాకు మ్యాచులు ఉన్నాయి. విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు.