SONU SOOD: బుల్లితెర యాంక‌ర్‌పై సోనూసూద్ ప్రశంస‌ల వర్షం.. ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న హాట్ బ్యూటీ

బుల్లితెర‌పై టీవీషోస్‌తో ఎంతో మంది యాంక‌ర్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కేవ‌లం టీవీ షోలతోనే కాక‌ ఐపీఎల్‌, ప్రొకబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది వింధ్యా విశాఖ‌. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న వేళ వింధ్యా త‌న వంతు సాయం చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌తో పాటు సోనూసూద్ ప్ర‌శంస‌లు అందుకుంది. వివ‌రాల‌లోకి వెళితే ప్ర‌స్తుతం క‌రోనా వేళ సోనూసూద్ త‌న పేరుతో ఓ ఫౌండేష‌న్ స్థాపించి ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు సోనూసూద్‌కు త‌మ వంతు విరాళాలు అందిస్తూ మాన‌వత్వం చాటుకుంటుండ‌గా, ప్రముఖ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖ తన వంతు సాయంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చింది. తన కాస్టూమ్స్‌ను వేలం వేసి వచ్చిన నగదు మొత్తాన్ని ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై సోనూసూద్‌ స్పందించారు.


‘మీరు నిజమైన రాక్‌స్టార్‌’ అంటూ సోనూసూద్‌ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సహాయానికి ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సోనూ ఓ వీడియో ద్వారా తెలియ‌జేయ‌గా, ఈ వీడియోని వింధ్యా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వింధ్యా చేసిన మంచి ప‌నికి నెటిజ‌న్స్ కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.