vijayendra prasad: రాజమౌళి కాకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్ మెచ్చే డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఈ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది. బాహుబ‌లి త‌ర్వాత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు కూడా చాలా పేరొచ్చింది.గ‌తంలో త‌నయుడు రాజ‌మౌళితో క‌లిసి చాలా సినిమాలు చేసిన బాహుబ‌లితో ఆయ‌న పేరు మారుమ్రోగిపోయింది. కేవలం తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా మారిపోయారు విజయేంద్ర ప్రసాద్. ‘శ్రీకృష్ణ 2006’ ‘రాజన్న’ ‘శ్రీవల్లి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకోగా ఓ విష‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

తెలుగు ఇండ‌స్ట్రీలో రాజ‌మౌళి కాకుండా మీకు న‌చ్చిన డైరెక్ట‌ర్ ఎవ‌రు అని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ని అలీ ప్ర‌శ్నించ‌గా, దానికి వెంట‌నే ఆయ‌న పూరీ జ‌గ‌న్నాథ్ అని చెప్పుకొచ్చారు. ”పూరి జగన్నాథ్. ఆయన అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ అన్నారు. రైటర్ గా సక్సెస్ అయిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ డైరక్టర్ గా సక్సెస్ కాలేకపోయారు. ఈ విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ”ఒక వ్యక్తి ‘రాజన్న’ సినిమా చూసి తెలుగులో ముందు వరుసలో ఉన్న డైరక్టర్లతో సమానంగా తీశారు అన్నాడు. మళ్లీ అదే వ్యక్తి ‘శ్రీవల్లీ’ సినిమా చూసి ‘మీకు డైరక్షన్ రాదు’ అని చెప్పాడు. అతను మా అబ్బాయి రాజమౌళి” అని నవ్వుతూ చెప్పారు విజయేంద్ర ప్రసాద్.

ఇక ‘విజయేంద్రప్రసాద్ గారి అబ్బాయి రాజమౌళి. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్. ఈ రెండింట్లో మీకు ఏది బాగా అనిపించింది?’ అని అలీ ప్రశ్నించారు. దీనికి ఆయన మాట్లాడుతూ ”మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరుంటే ‘నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడవుతాడ’నే కోరిక ఉండేది. రెండో దాంట్లో ‘నా కొడుకు అంతటి స్థాయికి నేనెప్పుడు ఎదుగుతా’నని బాధ ఉంటుంది” అని అన్నారు. ప్ర‌స్తుతం విజయేంద్ర ప్ర‌సాద్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ప‌ని చేస్తుండ‌గా, ఈ సినిమాలో అలియా భ‌ట్ పాత్ర గురించి చెప్పారు. ప్రతి సీన్ లోనూ ఆమే కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.