Liger: ‘లైగర్’ క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. తగ్గేదే లే అంటున్న పూరీ జగన్నాథ్

Liger: ఒక్క హిట్ వస్తే చాలు.. ముందున్న ఫ్లాప్స్ అన్నీ పోతాయి. ఆ ఇమేజ్ కూడా పోయి మళ్లీ కొత్త మార్కెట్ వచ్చేస్తుంది. పూరీ జగన్నాథ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈయనకు కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. గత 14 ఏళ్ళలో ఈయన నుంచి దేశముదురు.. బిజినెస్ మ్యాన్.. టెంపర్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలినవన్నీ ఫ్లాపులే. వరస ఫ్లాపుల్లో ఉన్నపుడు వచ్చిన ఇస్మార్ట్ శంకర్.. పూరీలోని నూతనోత్తేజాన్ని బయటపెడుతుంది.

Vijay Deverakonda Liger Movie Climax Leaked
Vijay Deverakonda Liger Movie Climax Leaked

పూరీ జ‌గ‌న్నాథ్ కెరీర్ మొదలుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకూ తన వర్కింగ్ స్టైల్ ఏ హీరో కోసం మార్చుకోలేదు ఈయన. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా.. అల్లు అర్జున్ ఉన్నా.. మహేష్ బాబు అయినా ఎవరైనా కూడా పూరి పనిచేసే తీరు మాత్రం మారదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం తనను తాను మార్చుకుంటున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తుండటం గమనార్హం. అక్కడ కూడా భారీగానే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండపై ఇంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే తన స్టైల్ కు భిన్నంగా ఈ సినిమాను చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తున్నాడు. ఏ సినిమా అయినా కూడా ఆరు నెలల్లో పూర్తి చేసే పూరి.. విజయ్ దేవరకొండ సినిమా కోసం మాత్రం ఏడాదిన్నర తీసుకున్నాడు. మధ్యలో కరోనా బ్రేక్ పక్కన పెట్టినా కూడా విజయ్ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. బహుశా ఆయన కెరీర్లో ఇంత టైం తీసుకొని చేస్తున్న సినిమా ఇదే కావచ్చు.

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఈ సినిమా క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇందులో ఒరిజినల్ ఇంటర్నేషన్ బాక్సర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. అతడే విజయ్ దేవరకొండతో ఫైట్ చేయనున్నాడు. ఈ క్లైమాక్స్ సీన్ చాలా అద్భుతంగా వస్తుందని పూరీ కూడా నమ్మకంగా చెప్తున్నాడు. మరోవైపు లైగర్ ఫలితంపైనే విజయ్ కెరీర్ కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈయన గత సినిమాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ దారుణంగా నిరాశ పరిచాయి.