VENKATESH: ‘డ్రైవింగ్ లైసెన్స్’ కోసం ప్రయత్నిస్తున్న వెంకటేష్.. వ‌ర్క‌వుట్ అవుతుందా?

VENKATESH టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కనిపిస్తుంది. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరోలు అయితే అన్నీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు. అందరూ కాదు కానీ చిరంజీవి, పవన్ ఫోకస్ అంతా ఇప్పుడు రీమేక్ సినిమాలపైనే ఉంది. వాళ్ళతో పాటు వెంకటేష్ కూడా ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఎఫ్ 3 సినిమాను మినహాయిస్తే మిగిలిన రెండు సినిమాలు రీమేకులే. ఇప్పటికే దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ ఇక్కడ కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. దీన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అసురన్ తెలుగు రీమేక్ నారప్పలోనూ వెంకటేష్ నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో రీమేక్ పై కూడా వెంకటేష్ మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది. అదే డ్రైవింగ్ లైసెన్స్. దివంగత దర్శకుడు, అయ్యప్పునుమ్ కోషియుమ్ ఫేమ్ సాచి కథ అందించిన ఈ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ చిత్ర రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారు. అక్కడ పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడ 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. మరి ఈ మల్టీస్టారర్ తెలుగులో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement