Varun Tej: మెగా హీరోని క‌లిసేందుకు 200కి.మీ న‌డిచిన అభిమాని.. క‌ల నెర‌వేర‌డంతో ఆనందంలో సూప‌ర్ ఫ్యాన్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. చిరంజీవి నాటిన మొక్కకు ప‌లు వేళ్ళ మాదిరిగా ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌తి హీరో చిరంజీవి పేరుని వాడ‌కుండా సొంత‌గా త‌మ కాళ్ల‌పై నిల‌దొక్కుకునేందుకు చాలా కృషి చేస్తున్నారు. ముకుంద సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వ‌రుణ్ తేజ్. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్‌ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్‌ మాత్రం వైవిధ్యమైన సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ కొత్త ధోర‌ణిలో ముందుకు సాగుతున్నాడు.

ప్ర‌స్తుతం ఎఫ్‌2కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఎఫ్ 3 అనే సినిమాతో పాటు కొత్త దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్షన్‌లో `గని` సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. జూలై 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. మ‌రోవైపు ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో వరుణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్‌. ఈ చిత్ర షూటింగ్ మొత్తం లండ‌న్ లోనే జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా కూడా కాస్త వైవిధ్యంగా ఉంటుంద‌ని స‌మాచారం.

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న‌వ‌రుణ్ తేజ్‌కు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్‌గా పెరుగుతూ పోతుంది. అతని సినిమా కోసం అభిమానులు ఎదురు చూడ‌డ‌మే కాదు థియేటర్స్ ద‌గ్గ‌ర నానా హంగామా చేస్తున్నారు. తాజాగా వ‌రుణ్ తేజ్ అభిమాని ఒక‌రు ఆయ‌నని క‌లిసేందుకు బిక్క‌నూరు నుండి హైద‌రాబాద్‌కు కాలి న‌డ‌క‌న వ‌చ్చారు. బాలు అనే ఈ అభిమాని దాదాపు 3 ఏళ్ళుగా వ‌రుణ్ తేజ్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ఎట్ట‌కేలకు 200 కి.మీ నుండి కాలి న‌డ‌క‌న వ‌చ్చి త‌న అభిమాన హీరోని క‌ల‌వడంతో ఫుల్ ఖుష్ అయ్యాడు. ఎన్నో ఏళ్ళుగా క‌న్న క‌ల నిజం అవ్వ‌డంతో బాలు ఆనందానికి అవ‌ధులు లేవు. ఆ మ‌ధ్య అల్లు అర్జున్ అభిమాని కూడా ఒక‌రు ఇలానే కాలి న‌డ‌కన వ‌చ్చి బ‌న్నీని క‌లిసిన విష‌యం తెలిసిందే.

 

 

Advertisement