VAISHNAV TEJ: ఓటీటీనా లేదంటే ఏడాది చివ‌ర‌లోనా.. క్రిష్ ప్లాన్ ఏంటి ?

బయట పరిస్థితులు ప్రస్తుతం అంతగా బాగోలేవు. కరోనా వైరస్ కారణంగా సినిమాలు విడుదల కావడం లేదు. షూటింగ్ కూడా ఆపేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండండి.. బయటికి రాకండి.. క్షేమంగా ఉండండి అంటూ మన హీరో హీరోయిన్లు కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు అలాగే బాక్సుల్లోనే ఉండిపోయాయి. వాటిని బయటకు తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తున్నా కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు. కొందరు ఎన్ని రోజులైనా వేచి చూసి తమ సినిమాలను థియేటర్లోనే విడుదల చేస్తామని చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం ఓటిటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. రేపు ఒకసారి పరిస్థితులు చల్లబడిన తర్వాత అందరూ ఒకేసారి థియేటర్లపై దండయాత్ర చేస్తారు.

అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ సమయంలో చిన్న సినిమాలకు, మీడియం బడ్జెట్ సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టమే. ఈ విషయం గమనించిన కొందరు నిర్మాతలు తమ సినిమాలను నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమాను కూడా నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప్పెన లాంటి సంచలన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇది విడుదల కాకముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా పూర్తి చేశాడు. కొండ పాలెం నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కేవలం 45 రోజుల్లోనే మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేశాడు.

దీనికి కొండపాలెం లేదంటే జంగిల్ బుక్ ఈ రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలపై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారట‌ దర్శక నిర్మాతలు. అదీ కాక‌పోతే ఏడాది చివ‌ర‌కు మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కిస్తూనే.. షూటింగ్ గ్యాప్ లో ఈ సినిమాను పూర్తి చేశాడు క్రిష్. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్. పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో ఈమె నటిస్తోంది. మరి ఈ సినిమాను నిజంగానే ఓటీటీలో విడుదల చేస్తారో లేదో చూడాలి.

Advertisement