REMUNERATION: రెమ్యున‌రేష‌న్ పెంచిన మెగా హీరో.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ

మెగా కుటుంబంలో దర్శకులకు ఇప్పుడు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు. ఈయన కోసం ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు. రామ్ చరణ్ సహా ఇండియాలో డెబ్యూ హీరోల రికార్డులన్నీ ఒక్క సినిమాతోనే తుడిచేసాడు వైష్ణవ్. దాంతో ఈయనతో సినిమాల కోసం నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు హిట్ వచ్చిన తర్వాత వైష్ణవ్ కూడా తొందరపడటం లేదు. మెల్లగా జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈయన క్రిష్ సినిమాను పూర్తి చేసాడు. ఉప్పెన షూటింగ్ పూర్తైన వెంటనే ఈ సినిమాను పూర్తి చేసాడు వైష్ణవ్.

కొండపాలం పేరుతో ఈ సినిమా వస్తుంది. ఆ నవల ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసాడు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. ఉప్పెనకు ముందు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ రేట్ అడుగుతున్నారు నిర్మాతలు. దాదాపు 14 కోట్ల వరకు క్రిష్ సినిమా బిజినెస్ చేస్తుంది. మరోవైపు మూడు, నాలుగు సినిమాలను కూడా ముందుగానే లైన్ లో పెట్టేసాడు వైష్ణవ్ తేజ్. ఈ మధ్యే ఆయన మూడో సినిమా తమిళ దర్శకుడు గిరీశయ్యతో కమిట్ అయ్యాడు. తమిళ్ అర్జున్ రెడ్డి సినిమాను ఆయన తెరకెక్కించాడు. ఈయన చెప్పిన కథ నచ్చి వైష్ణవ్ సినిమా చేస్తున్నాడు.

మరోవైపు నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ లో ఈయన ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు పృథ్వీ చెప్పిన కథ నచ్చి మెగా మేనల్లుడితో సినిమా నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ కు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. మరోవైపు ఈయన 5వ సినిమా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా చేయబోతున్నట్లు తెలుస్తుంది. నాని కోసం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఇప్పుడు వైష్ణవ్ కు సెట్ చేస్తున్నారు. మొత్తానికి వైష్ణవ్, నాగార్జున కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో..?