Vaishali : నటి వైశాలి ఆత్మహత్య: శోక సంద్రంలో అభిమానులు.!
NQ Staff - October 18, 2022 / 12:16 PM IST

Vaishali : సినీ పరిశ్రమలో తట్టుకోలేనంత ఒత్తిడి వుంటుందని చెబుతుంటారు కొందరు. ప్రముఖ నటీనటులు తాము మానసిక ఒత్తిడితో బాధపడుతున్నామని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. మానసిక వైద్య నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ పొందుతూ, ఆ సమస్య నుంచి సాంత్వన పొందుతుంటారు నటీనటులు, దర్శక నిర్మాతలు. వాస్తవానికి సినీ పరిశ్రమ మాత్రమే కాదు, ఏ రంగం అయినా ఒత్తిడితో కూడుకున్నదే.
ఒత్తిడిని జయించగలిగితేనే విజయం దక్కుతుంది ఎవరికైనా. వర్ధమాన నటి ఆత్మహత్య.. కారణమేంటి.? కొన్నాళ్ళ క్రితం ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలుగు సినీ పరిశ్రమలో యువ కథానాయకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే. తాజాగా బుల్లితెర నటి వైశాలి టక్కర్ బలవన్మరణానికి పాల్పడింది.
ఇండోర్‌లో ఆమె తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. ‘ససురల్ సిమర్ కా’ అనే టీవీ సీరియల్ ద్వారా నటిగా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లోనూ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి కూడా. ఇలాంటి తరుణంలో వైశాలి టక్కర్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె మరణం వెనుక బలమైన కారణం వుండి వుంటుందనీ, ఈ ఘటనపై విచారణ జరపాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.