suma : రెండో సీజ‌న్‌లో వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న స్టార్ మ‌హిళ‌.. సుమ‌తో సంద‌డి చేసిన మెగా హీరో

suma : త‌న చలాకీ మాట‌ల‌తో గ‌త మూడు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యాంక‌ర్ సుమ క‌న‌కాల‌. బుల్లితెర‌పై షోస్ చేయాల‌న్నా, ఆడియో ఫంక్ష‌న్స్ కోసం స్టేజ్‌ల‌పై హోస్టింగ్ చేయాల‌న్నా సుమ కన‌కాల పేరే మొద‌ట వినిపిస్తుంది. ఆడ‌ప‌డ‌చుల‌తో క‌లిసి సుమ స్టార్ మ‌హిళ అనే కార్య‌క్ర‌మం చేయ‌గా, ఈ షో ఎంత‌గానో అల‌రించింది. కొన్ని వేల ఎపిసోడ్స్ జ‌రుపుకున్న ఈ షో మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకొని తిరిగి ప్రారంభ‌మైంది. మధ్యాహ్నాం 12:30 గంటలకు సోమవారం నుంచి బుధవారం వరకు ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చీఫ్ గెస్ట్‌లుగా ఉప్పెన టీం హాజ‌రైంది. సుమతో క‌లిసి ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ తెగ సంద‌డి చేయ‌గా, అతి త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మం టెలికాస్ట్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. కృతిశెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచింది. చిత్రంలోని ప్ర‌తి సాంగ్ శ్రోత‌ల‌ని రంజింప‌జేసింది. ముఖ్యంగా నీ క‌న్ను నీలి స‌ముద్రం అనే సాంగ్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించ‌డం.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌డం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌డంతో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగాయి.

ఉప్పెన చిత్రం హీరోకే కాక ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, హీరోయిన్ కృతిస‌న‌న్‌కు కూడా డెబ్యూ చిత్రం. కాగా ఈ మూవీని ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయబోతున్నారు. గ‌త ఏడాది విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న ఆగింది. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో వైష్ణ‌వ్ తేజ్‌ని గాయ‌ప‌రిచిన‌ట్లు చూపించ‌గా.. ఈ మూవీలో హీరోను న‌పుంశ‌కుడిని చేస్తాడ‌న్న టాక్ న‌డుస్తోంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో ట్రైల‌ర్ విడుద‌ల కానుండ‌గా, దీంతో సినిమాపై ఓ క్లారిటీ రానుంది.

Advertisement