మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కుందనపు బొమ్మ కృతి శెట్టి ప్రధాన పాత్రలలో డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకోవడమే కాక వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణాలు అయ్యాయి.
కరోనా కష్టకాలంలో థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఉప్పెన మూవీ విజయోత్సవ సభను గత రాత్రి ఘనంగా నిర్వహించారు. కరోనా వలన భారీగా వేడుక జరపకుండా ప్రైవేట్ ఫంక్షన్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, దర్శకుడు సుకుమార్‌తో పాటు ప్రస్తుతం మైత్రి మూవీ బ్యానర్ లో సినిమాలు చేస్తున్న దర్శకులు, సినిమాలు చేయబోతున్న దర్శకులతో పాటు గతంలో మైత్రి మూవీస్ బ్యానర్ లో సినిమాలు చేసిన దర్శకులను, మరి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు విజయోత్సవ వేడుకలో హాజరు అయ్యారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉప్పెన సినిమాను మరి కొద్ది రోజులలో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మార్చి 24 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక వైష్ణవ్ తేజ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేశాడు. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రకుల్ ప్రీత్ కథానాయికగా నటించింది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఉప్పెన దర్శకుడు హీరోయిన్ కృతి శెట్టికి కూడా వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి.