Uday Kiran : ఉదయ్ కిరణ్ లేకుండానా?.. విధి ఎంత వి‘చిత్రం’?

Uday Kiran : రోజూ సినిమా వార్తలు ఎన్నో వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఈ రోజు వచ్చిన ఒక మూవీ అప్డేట్ మాత్రం తెలుగు చలన చిత్ర అభిమానుల మనసులను బరువెక్కిస్తోంది. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ని మరోసారి గుర్తుకు తెచ్చి బాధపెడుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యంగ్ హీరో 2014 జనవరి 6న బలన్మరణం పొందిన తీరును తలచుకుంటేనే అయ్యో అనిపిస్తోంది. సినిమా ఛాన్స్ రాకనో, కుటుంబ కలహాల వల్లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవటం ఆయన ఫ్యాన్స్ నే కాదు మొత్తం ఇండస్ట్రీనే తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ యువ కథానాయకుడు తనకుతానుగా తనువు చాలించిన తర్వాత గానీ జనానికి అసలు విషయం తెలియలేదు.. అతను నిజ జీవితంలో ఎన్ని బాధలు పడ్డాడో అని. తల్లి చనిపోవటం, తండ్రి మరో పెళ్లి చేసుకోవటం, సోదరి విదేశాల్లో ఉండటం, భార్యతో మనస్పర్థలు వంటివన్నీ ఉదయ్ కిరణ్ ని మానసికంగా, శారీరకంగా ఒంటరిని చేశాయి.

‘‘అనాథ’’గా..

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అతని డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయ్యాక, దాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదని, దీంతో అది పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ ఆవరణలో అనాథ శవంలా ఉండిపోయిందని అప్పట్లో పేపర్లలో, టీవీల్లో వచ్చిన వార్తలు విని, చూసి కళ్ల నీళ్లు పెట్టనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఉదయ్ కిరణ్ మీద కోపంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతని తండ్రి తొలుత ముందుకు రాలేదని, బంధు మిత్రుల బలవంతం మీదే ఒప్పుకున్నాడనే విషయం కూడా వెలుగు చూడటం మరింత ఘోరం. మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు కావాల్సిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఆ పెళ్లి రద్దు కావటం, తర్వాత అతను విషిత అనే మరో అమ్మాయిని వివాహం చేసుకోవటం, అనంతరం ఇలా దిక్కులేనివాడిగా మిగిలిపోవటం వంటి పరిణామాలన్నీ గమనిస్తే విధి ఎంత వి‘చిత్రం’గా ఉంటుందో అర్థమవుతుంది. ఉదయ్ కిరణ్ సినిమా లోకాన్నే కాదు శాశ్వతంగా ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లిపోయిన ఏడేళ్ల తర్వాత ఈ ట్రాజెడీ ఎపిసోడ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే..

ఫ్లాష్ బ్యాక్..

హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తోపాటు ఏకంగా 45 మంది కొత్త టెక్నీషియన్లను తెలుగు వెండి తెరకు పరిచయం చేసిన సినిమా ‘‘చిత్రం’’. 21 ఏళ్ల కిందట 2000వ సంవత్సరంలో రామోజీరావు నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై విడుదలైన ఈ చిత్రం ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిచింది. హీరోగా ఉదయ్ కిరణ్, హీరోయిన్ గా రీమా సేన్, డైరెక్టర్ గా తేజ, మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పీ పట్నాయక్ సహా ఎంతో మంది కెరీర్ లో ఇది మెమొరబుల్ మూవీగా మిగిలిపోయింది.

Uday Kiran : uday-kiran-hit-film-sequel-coming
Uday Kiran : uday-kiran-hit-film-sequel-coming

మరోసారి..

ఇప్పుడు ఆ ‘చిత్రం’ సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఈ రోజు(సోమవారం) తన బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో వెల్లడించారు. సీక్వెల్ కి కూడా ‘చిత్రం’ పేరునే కొనసాగిస్తున్నారు. కాకపోతే దాని పక్క 1.1 అని కొత్తగా యాడ్ చేస్తున్నారు. పాత్ర ‘చిత్రం’ను ఉషాకిరణ్ మూవీస్ నిర్మించగా కొత్త ‘‘చిత్రం’’ను తేజ సొంత నిర్మాణ సంస్థ ‘‘చిత్రం మూవీస్’’, ‘‘ఎస్ స్టూడియోస్’’ కంబైన్డ్ గా తెరకెక్కస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వర రావు వ్యవహరించనున్నారు. షూటింగును వచ్చే నెల (మార్చి) నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ హిట్టా?: Uday Kiran

యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల వారినీ అలరించిన ‘‘చిత్రం’’ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో సీక్వెల్ పై దాదాపు అవే అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. మళ్లీ అందరూ కొత్త వారితోనే రూపొందిస్తున్న ‘‘చిత్రం 1.1’’ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందా అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ ఆర్పీ పట్నాయక్ నే సెలెక్ట్ చేశారు. నటీనటుల వివరాలను త్వరలో చెబుతామని అంటున్నారు. కానీ.. ఉదయ్ కిరణ్ లేని లోటును భర్తీ చేయటం మాత్రం చాలా కష్టం.

Advertisement