KGF 2 : సినిమాపై అదిరిపోయే అప్‌డేట్స్.. ఇక ఫ్యాన్స్‌కు పూన‌కాలే!

ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ అయిపోవచ్చా అంటే అయిపోవచ్చు. దీనికి ఆరేళ్ళ కింద బాహుబలి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు కెజియఫ్ నిలుస్తుంది. సౌత్ సినిమాలకు ఇంత క్రేజ్ ఉందా అనేలా సత్తా చూపించాయి ఈ రెండు సినిమాలు. తాజాగా కెజియఫ్ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం అన్ని భాషల ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో అయితే నభూతో నభవిష్యతీ అన్నట్లుగా ఈ చిత్ర బిజినెస్ జరుగుతుంది. ఒకప్పుడు 40 కోట్ల బిజినెస్ అంటేనే నోరెళ్లబెట్టే వాళ్లు ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం 200 కోట్లకు పైగానే లెక్కలు చెబుతున్నారు. కెజియఫ్ తొలి భాగం 100 కోట్లకు పైగా వసూలు చేసింది కన్నడలో. మిగిలిన అన్ని భాషల్లో కలిపి దాదాపు 200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది ఈ చిత్రం.

దాంతో ఇప్పుడు రెండో భాగం బిజినెస్ కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న రేట్స్ విని బయ్యర్లకు భయం పుడుతుందని తెలుస్తుంది. కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారు. అక్కడ యశ్ స్టార్ హీరో.. సొంత సినిమా కాబట్టి అంత వస్తుందేమో..? కానీ తెలుగులో కూడా కెజియఫ్ 2 కోసం ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదేకానీ నిజమైతే అంతకంటే సంచలనం మరోటి ఉండదు. ఎందుకంటే కెజియఫ్ తొలిభాగం 5 కోట్లకు సొంతం చేసుకుంటే.. 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రెండో భాగంపై ఉన్న అంచనాల దృష్ట్యా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా అంత రేట్ అంటే మాత్రం నిజంగానే సంచలనం.

మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో 80 కోట్ల వరకు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. మొత్తమ్మీద కెజియఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడనట్లు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అంతేకాదు ఫస్టాఫ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో ఒకటి.. సెకండాఫ్ లో నోరా ఫతేహితో మరో ఐటం సాంగ్ చేయిస్తున్నారు. ఒకే సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్.. ఇద్దరు బాలీవుడ్ భామలతో చేయిస్తున్నారు. ఇలాంటి క్రేజీ థింగ్స్ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయంటున్నారు దర్శక నిర్మాతలు. కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది.

Advertisement