PRABHAS యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్ర షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. రెండు చిత్రాల షూటింగ్స్ ఏకకాలంలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. సలార్ షూటింగ్ గత నెలలో ప్రారంభం కాగా, దర్శకుడు ముందుగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. గోదావరి ఖనిలో చిత్ర షూటింగ్ కొనసాగుతుంది. అలానే ముంబైలోని గోరెగావ్ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ మొదలు పెట్టారు. ఫిబ్రవరి 2 చిత్ర షూటింగ్ మొదలైన విషయాన్ని ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రభాస్ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయని అందరు సంతోషిస్తున్న క్రమంలో రెండు షాకింగ్ న్యూస్‌లు అందరిని భయబ్రాంతులకు గురి చేశాయి. మంగళవారం సాయంత్రం 4.10 గంటల సమయంలో గోరెగావ్ స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో సగం సెట్ అగ్నికి ఆహుతైంది. అదృష్టం ఏమంటే ఆ సమయంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ఆ పరిసర ప్రాంతాలలో లేరు. దాదాపు 8 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేసినట్టు సమాచారం. ఈ విషాద సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే సలార్ టీంకు రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్త బయటకు వచ్చింది.
గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఓ యూటర్న్ వద్ద సలార్ యూనిట్ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో చిత్ర బృందానికి సంబంధించిన కొందరు గాయపడ్డారు. వీరందరిని మమత ఆస్పత్రికి తరలించారు. అందరు క్షేమంగానే ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.గత కొద్ది రోజులుగా సలార్ సినిమా గోదావరి ఖనిలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో బొగ్గు గనుల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల లొకేషన్లో ప్రభాస్‌కు సంబంధించి కొన్ని విజువల్స్ బయటకు రాగా, అందులో యంగ్ రెబల్ స్టార్‌ని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. అయితే ఒకే రోజు రెండు సినిమా యూనిట్లలో ప్రమాదం జరగడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది.