Trivikram: ఈ ద‌ర్శ‌కుడు త‌న హీరోల ముసుగు ఎప్పుడు తీస్తాడో..!

Trivikram: అదేంటి.. ద‌ర్శ‌కుడు త‌న హీరోల ముసుగు తీయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కొన్ని సంవత్సరాలుగా త‌న హీరోల‌కు ముసుగు వేస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన దర్శకుడిగా మారిన తర్వాత ప్రతి సినిమాలోనూ జరిగేది ఇదే. అది సెంటిమెంట్ అనుకుంటారో.. కథాపరంగా అలా జరుగుతుందో తెలియదు. కానీ ప్రతి సినిమాలో మాత్రం ఖచ్చితంగా ముసుగు వేసుకొని ఉంటాడు. అంటే మొహానికి ఏదో వేసుకుంటాడు అని కాదు. అజ్ఞాతంలో ఉంటాడు అని.. లేదంటే పేరు మార్చుకుని దాక్కొని ఉంటాడు. ఒకసారి త్రివిక్రమ్ చేసిన సినిమాలన్నీ పరిశీలిస్తే ఇదే విషయం మనకు అర్థం అవుతుంది.

Trivikram using Same Formula in all Movies
Trivikram using Same Formula in all Movies

చిన్న హీరోలతో చేసిన నువ్వే నువ్వే, అ..ఆ సినిమాలను మినహాయిస్తే స్టార్ హీరోలతో పని చేసిన ప్రతి సినిమాలో కూడా హీరో అజ్ఞాతంలో ఉండటం కామన్ గా ఉంటుంది. అతడు సినిమాలో పేరు మార్చుకుని నాజర్ ఇంటికి వస్తాడు మహేష్ బాబు. ఆ తర్వాత జల్సా సినిమాలో నక్సలైట్ గా మారిన తర్వాత జన జీవన స్రవంతిలో కలుస్తాడు పవన్ కళ్యాణ్. ఖలేజా సినిమాలో కూడా వేరే చోటికి వెళ్తాడు మహేష్. జులాయి సినిమాలో సోను సూద్ కు భయపడి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తాడు అల్లు అర్జున్. అత్తారింటికి దారేదిలో తన ఐడెంటిటీ మార్చుకుని అత్త కోసం కారు డ్రైవర్ గా మారుతాడు పవన్ కళ్యాణ్. సన్నాఫ్ సత్యమూర్తిలో ల్యాండ్ పేపర్ల కోసం ఉపేంద్ర ఇంటికి మారు పేరుతో వెళ్తాడు అల్లు అర్జున్. అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ పూర్తిగా అజ్ఞాతంలోనే ఉంటాడు. మూడేళ్ల కింద వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అజ్ఞాతంలోనే ఉంటాడు.

అల వైకుంఠపురంలో సినిమాలో తల్లిదండ్రుల కోసం అల్లు అర్జున్ కూడా దాక్కొని ఉంటాడు. ఇలా ప్రతి సినిమాలో హీరోను దాచిపెట్టడం త్రివిక్రమ్ కు అలవాటుగా మారిపోయింది. తాజాగా మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ఇలాగే ఉంటుందని తెలుస్తోంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అతడు సినిమా మార్చి తీస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని తెలుస్తోంది. అందుకే టైటిల్ కూడా పార్ధు అని పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మహేష్, త్రివిక్రమ్ సినిమా విడుదల కానుంది. మరి త్రివిక్రమ్ హీరో ఎప్పుడు అజ్ఞాతం వీడి బయటకు వస్తాడో చూడాలి.