Trivikram: మహేష్ 28వ సినిమా విషయంలో కంట్రోల్.. కంట్రోల్ అంటున్న త్రివిక్రమ్

Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే వాళ్ల రేంజ్ ఏంటి అనేది చూపిస్తాయి. అన్ని సినిమాలను కేవలం విజయాలతోనే కొలవలేము. కొన్ని అలా చరిత్రలో నిలిచిపోతాయి అంతే. అలాంటి అద్భుతమైన కాంబినేషన్ మహేష్, త్రివిక్రమ్ సొంతం. ఒక అతడు కానీ.. ఖలేజా కానీ ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. కొన్ని వందల సార్లు చూసినా కూడా బోర్ కొట్టాయి అనలేరు. అలాంటి క్లాసిక్స్ ఈ కాంబినేషన్లో వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. అది కూడా దాదాపు 11 ఏళ్ల తర్వాత.

దాంతో అంచనాలు ఇంకెంత ఉంటాయి అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతలకు మాత్రం ఒక టెన్షన్ అలాగే ఉండిపోతుంది.. అదే బడ్జెట్. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. టీవీలో మాత్రం చరిత్ర సృష్టించాయి. మహేష్ బాబు మార్కెట్ తో పనిలేకుండా అతడు సినిమాకు ఆ రోజుల్లోనే 20 కోట్లకు పైగా ఖర్చు చేయించాడు త్రివిక్రమ్. 16 కోట్ల బిజినెస్ చేస్తే 17 కోట్లు వసూలు చేసింది. కానీ నిర్మాత మురళీమోహన్ మాత్రం నష్టపోయాడు. ఆ తర్వాత డిజిటల్ రైట్స్ బాగా రావడంతో ఆయన గట్టెక్కాడు. ఖలేజా విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. 40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. షూటింగ్ చేసిన చాలా సన్నివేశాలు ఎడిటింగ్ రూమ్ లో లేపేశారు. అలా కూడా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఈసారి అలాంటి తప్పు జరగకుండా త్రివిక్రమ్ ముందు నుంచి జాగ్రత్త పడుతున్నాడు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. అనవసరపు ఖర్చు లేకుండా.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ కు వెళ్లాలని త్రివిక్రమ్ కూడా భావిస్తున్నాడు. అన్నట్లు ఈ సినిమాకు కు పార్ధు అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్ధు అనే టైటిల్ కు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కు మంచి అనుబంధం ఉంది. అతడు సినిమాలో మహేష్ బాబు పేరు అదే పార్ధు పాత్రలో అద్భుతంగా నటించాడు సూపర్ స్టార్. అందులో నందు, పార్ధు ఈ రెండు పేర్లతో నటించాడు. రెండోది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే పేరును తన సినిమా టైటిల్ గా పెట్టాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు కూడా బయటకు రానున్నాయి.