Trivikram: ప్రతి పాట‌లో, ప్రతి మాట‌లో ఆయన మనతోనే ఉన్నారు

Trivikram: ఎస్.పి. బాలసుబ్రమణ్యం.. ఆయన మాట మంత్రం.. ఆయన పాట పరవశం.. అంతులేని సముద్రంలాంటి పరవళ్ళు తొక్కే ఆనందం ఆయన స్వరం. ఆయన పాడిన పాట వింటున్నంత సేపు మరో లోకంలో విహరించే మైమరపు. అంతకన్నా ఆనందం ఉంటుందా అనే హాయి. పాటల ప్రేమికులకు ఆయన దేవుడు. సింగర్ గా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విశేషమైన, విలక్షణమైన ప్రతిభ కనబరచిన మహానీయుడు. గత సంవత్సరం కరోనా కారణంగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం తుదిశ్వాస విడిచారు. ఈరోజు బాలుగారి మొదటి జయంతి సందర్భంగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, అనుభవాల్ని పంచుకున్నారు.

నిజానికి అప్పటివరకు బాలసుబ్రమణ్యం గారు హీరో కమల్ హాసన్ కు మాత్రమే డబ్బింగ్ చెప్పారు. కానీ త్రివిక్రమ్ అడిగారన్న నెపంతో అతడు సినిమాలో నాజర్ గారికి డబ్బింగ్ చెప్పారు. ఒక్కసారి అతడు సినిమాలో నాజర్ వాయిస్ గుర్తుకుతెచ్చుకోండి. ఆ సినిమాలో నాజర్ క్యారెక్టర్ ఎంత బలాన్నిచ్చిందో.. ఆయన గొంతు కూడా అంతే బలాన్నిచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే బాలు గారికి ప్రతిభతో పాటు ఇంటిలిజెన్స్ కూడా ఉందని.. ఒక సగటు ప్రేక్షకుడు థియేటర్ లో కూర్చుని చూసేటప్పుడు వినే వాయిస్, పాట ఎంత ఇంపాక్ట్ చేస్తుందో ఒక డబ్బింగ్ రూమ్ లోనే నుంచుని అంచనా వేసేంత టాలెంట్, అండర్ స్టాండింగ్ ఆయనకు ఉన్నాయని తెలిపారు. అందుకే బాలు గారు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయమయ్యారని.. ఈరోజున బాలు గారి జయంతిని ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఎప్పుడూ ఆయన విశ్రాంతి తీసుకోలేదని అన్నారు. అలాగే సౌత్ ఇండియాలో నంబర్ వన్ సింగర్ గా నిలిచారు. కనీవినీ ఎరుగని రీతిలో ఆయన ప్రతిభ కనబరిచేవారని అన్నారు. ప్రతి పాటలో, ప్రతి మాటలో మనతోనే ఆయన ఉన్నారని.. ఎప్పటికీ ఉంటారని.. మనందర్ని దగ్గరుండి ఆశీర్వదిస్తారని కోరారు. ఆయన పాట చూస్తున్నా.. వింటున్నా.. ఆ పాట వెనుక బాలు గారు నుంచుని ఎప్పటికీ మనకు పాటలు వినిపిస్తారని అన్నారు. అలాగే ఎంతోమంది సింగర్స్ భుజం మీద చేయి వేసి, ధైర్యంగా ముందుకు నడిపిస్తారని కోరుకున్నారు.