Pranitha: హీరోయిన్ ప్రణీత ‘‘అత్తారింటికి దారి’’ ఇదే..

Pranitha: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకున్నారు. తన ఓన్ సిటీ బెంగళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజుతో నిన్న ఆదివారం మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ విషయం కొంచెం ఆలస్యంగా ఇవాళ సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఆమె వివాహానికి సంబంధించి ముందస్తుగా పెద్దగా వార్తలు రాకపోవటం గమనార్హం. ఈ విషయంలో చాలా మంది హీరోయిన్లతో పోల్చితే ప్రణీత ప్రత్యేకమనే చెప్పొచ్చు. కొంత మంది కథానాయికలు తెగ హడావుడి చేస్తారు. ప్రపంచంలో మేం తప్ప ఎవరూ మ్యారేజ్ చేసుకోవట్లేదు అనేంత రేంజ్ లో మీడియాలో టాం టాం చేసుకుంటారు. పెళ్లి చేసుకోవటం ద్వారా తామేదో లోకాన్ని ఉద్ధరిస్తామన్నట్లు బిల్డప్ ఇస్తారు. కరోనా బాధితులను ఆదుకోవటంలో కూడా ప్రణీత ముందు వరుసలో నిలిచారు. వివాహం పేరుతో వింతగా, విచ్చలవిడిగా ప్రచారం చేసుకున్న హీరోయిన్లు ఎవరూ ప్రణీత మాదిరిగా కొవిడ్ సమయంలో ఇంటి నుంచి బయటికి రాకపోవటం విడ్డూరం.

Pranitha Subhash

అందానికి తగ్గట్లే.. అవకాశాలు..

ప్రణీత సుభాష్ పెద్ద అందగత్తేమీ కాదు. కాకపోతే కొంచెం పర్లేదు. కాబట్టే ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఛాన్స్ రాకపోయినా.. చేసింది కొన్ని మూవీలే అయినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటం ప్రణీత గొప్పతనం. డాక్టర్ల కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రణీత కన్నడ చిత్రం పోర్కి(తెలుగులో వచ్చిన పోకిరి పిక్చర్ ని కన్నడలో ఈ పేరుతో తీశారు) ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. తెలుగులో ఏడెనిమిది ఫిల్మ్స్ చేసినప్పటికీ ఆమె ‘‘అత్తారింటికి దారేది’’ అనే బొమ్మతోనే ‘బాపు బొమ్మ’గా పాపులర్ అయ్యారు.

Pranitha Subhash

మిగతావేంటి?..

ప్రణీత తెలుగులో నటించిన మిగతా చిత్రాలు.. ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే, డైనమైట్. వీటిలోని కొన్నింటిలో మెయిన్ హీరోయిన్ గా, మరికొన్నింటిలో సెకండ్ హీరోయిన్ గా మెరిశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రణీత చాలా తక్కువ మంది సమక్షంలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని అభిమానులకు షాకిచ్చారు. కొవిడ్ వల్ల పెళ్లి తేదీని ఫిక్స్ చేయటంలో ఆఖరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగిందని, అందుకే ముందుగా ప్రకటించకుండానే మనువాడాల్సి వచ్చిందని, ఈ మేరకు ఫ్యాన్స్ క్షమించాలని ప్రణీత చాలా సిన్సియర్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం విశేషం.

Pranitha Subhash