Tollywood Heroes: అభిమానులకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ రిక్వెస్ట్

Tollywood Heroes కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ఇండస్ట్రీలో అందరి కన్నా ముందుగా స్పందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి అదే పని చేశారు. కొవిడ్-19 వైరస్ నుంచి కోలుకున్నవారు దయచేసి ప్లాస్మాదానం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. దీనివల్ల మరింత మంది ప్రాణాలతో బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ సోమవారం ఉదయం ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు. అంతకన్నా గంట ముందు అక్కినేని నాగార్జున, గంట తర్వాత దగ్గుబాటు వెంకటేష్ సైతం ఇవే తరహా ట్వీట్లు పెట్టడం గమనార్హం. ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలు ఇలా ఈ మహమ్మారి విషయంలో బాధితుల పక్షాన తమ అభిమానులకు విజ్ఞప్తి చేయటం విశేషం.

చిరు ఏమన్నారు?..

‘‘కరోనా సెకండ్ వేవ్ లో బాధితులు మరింతగా పెరుగుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా ప్లాస్మా కొరత వల్ల చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కొద్ది రోజుల ముందే రికవర్ అయినట్లయితే మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. దానివల్ల ఇంకో నలుగురు కొవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవటానికి సహాయపడినవారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లాస్మా డొనేషన్ గురించిన వివరాల కోసం, సరైన సూచనల కోసం చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీసును సంప్రదించండి. 040-23554849, 9440055777 నంబర్లకు కాల్ చేయొచ్చు’’ అని మెగాస్టార్ పేర్కొన్నారు.

నాగార్జున..

‘‘మిత్రులారా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా దానం చేసి ప్రాణ దానం చేయండి. ఈమధ్యే కొవిడ్-19 నుంచి కోలుకున్నవారు టీ-హోప్ ప్రారంభించిన ఈ ఇనీషియేటివ్ లో పాల్గొనండి. సాయం చేయండి. సమాజంలో మార్పు కోసం మన వంతు ప్రయత్నిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక లింక్ ని షేర్ చేశారు. 18-60 ఏళ్ల మధ్య వయసువారు ఎవరైనా ప్లాస్మా ఇవ్వొచ్చని సూచించారు.

వెంకటేష్..

‘‘కొవిడ్-19 నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రతిఒక్కరికీ నా రిక్వెస్ట్. ప్లాస్మా అవసరం ఉన్నవారికి దయచేసి దాన్ని దానం చేయండి. ఈ కష్టకాలంలో మనం ఒకరి కోసం ఒకరం అనే భావనతో వ్యవహరిద్దాం. ప్లాస్మా డొనేట్ చేయాలనుకుంటే 9490617440 నంబర్ కి కాల్ చేయండి’’ అని విక్టరీ వెంకటేష్ చెప్పారు.

Advertisement