Tollywood: టాలీవుడ్‌కి గ‌డ్డు కాలం.. ఏపీ లో డిసెంబ‌ర్ వ‌ర‌కు ఇవే టికెట్ రేట్స్..!?

Tollywood: క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో అప్ప‌టి నుండి ప‌రిస్థితుల‌న్నీ పూర్తిగా మారాయి. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి అనేక ఇబ్బందులు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డం దాంతో సినిమాలు ఓటీటీలో విడుద‌ల‌కావ‌డం ఓ స‌మ‌స్య‌గా మారితే కొద్ది రోజులు క‌నోనా వ‌ల‌న షూటింగ్స్ స్తంభించ‌డంతో చాలా మంది కార్మికుల ప‌రిస్థితి ధైన్యంగా మారింది.

Tollywood Facing Difficulties on AP Ticket Rates
Tollywood Facing Difficulties on AP Ticket Rates

కొద్ది రోజులుగా ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో మూడు షోలు మాత్ర‌మే న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే నిర్మాత‌ల‌కు చాలా న‌ష్ట‌మ‌ని భావించిన టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు సిద్ధం అయ్యారు. గ‌తంలో చిరు సినిమా పరిశ్రమ సమస్యల మీద ఇతర ప్రముఖులతో కలిసి సీఎంను కలిసారు. ధియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వాటికి ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన సీఎం జగన్.. కొద్ది నెలల క్రితం అదే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు.

వకీల్ సాబ్ సినిమా నుండి ఏపీలో టిక్కెట్ల వ్యవహారం వివాదంగా మారింది. దీని పైన ఎగ్జిబిటర్లు కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రముఖ నటుల సినిమాలు విడుదల సమయంలో టిక్కెట్ల ధరలు పెంచుకొనే అవకాశం సాధారణంగా ఇచ్చేవారు. కానీ, వకీల్ సాబ్ కు ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ తరువాత ఆ రకంగా పెంచుకొనే నిర్ణయం జేసీల నుంచి తప్పించి..ప్రభుత్వ నిర్ణయం మేరకే అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సెప్టెంబ‌ర్18 లేదా 19వ తేదీల్లో సీఎం తో కలిసేందుకు అవకాశం..ఇందుకు సిద్దమవ్వాలంటూ చిరంజీవి టీంకు ప్రభుత్వం నుంచి సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ మీటింగ్‌తో ఏదైన ప‌రిస్థితులు మార‌తాయా అంటే అది క‌లేన‌ని అనిపిస్తుంది. డిసెంబ‌ర్ వ‌ర‌కు ఏపిలో సినిమాల రేట్లు విష‌యంలోఎలాంటి మార్పు ఉండ‌ద‌ని, గ‌తంలో లాగా 50 శాతం ఆక్యుపెన్సీతో 3 షోలో మాత్ర‌మే ఏర్పాటు చేసే అవ‌కాశం మాత్ర‌మే ఇస్తార‌ని స‌మాచారం.ఇలా పరిస్థితులు ఉంటే టాలీవుడ్‌కి ఇది గ‌డ్డు కాలంగా మార‌నుండ‌డం ఖాయం.