TNR : ‘‘నేను ఎక్కడికీ వెళ్లట్లేదు’’.. అంటూనే..

TNR: ఈ రోజు సోమవారం ఉదయం ఆఖరి శ్వాస విడిచిన పాపులర్ జర్నలిస్ట్ టీఎన్ఆర్ చివరిసారిగా మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తాను ఎక్కడికీ వెళ్లట్లేదు అంటూనే ఇవాళ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం ఎంతో మందిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. కరోనాను చూసి ఎవరూ భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అది మనల్ని ఏమీ చేయదని చెప్పిన ఆయనే ఆ మహమ్మారికి బలికావటం మింగుడు పడని విషయం. యోగా, ప్రాణాయామం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్పి, తానూ అవి చేస్తున్నానంటూ తెలిపి విధి చేతిలో ఓడిపోవటం ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.

TNR

 

హలో అండి.. నేను మీ..

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలో టీఎన్ఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘హలో అండి. నేను మీ టీఎన్ఆర్. ఎక్కడికీ వెళ్లట్లేదు. మంచి బుక్స్ చదువుతున్నా. మంచి సినిమాలు చూస్తున్నా. చెడులో కూడా మంచిని వెతుక్కోవాలంటారు కదా మన పెద్దలు. అలాగే.. ఈ కష్ట సమయమన్నది నాకు మంచి అలవాట్లను నేర్పింది. అవేంటంటే.. ప్రాణాయామం, యోగా. డైలీ ప్రాణాయామం చేస్తున్నా. నా పిల్లలతో కూడా చేయిస్తున్నా. దయచేసి పిల్లలతో ఈ సమయంలో బాగా గడపండి. ఇంట్లో వాళ్లతో గడపండి. పిల్లలకు మంచి మంచి విషయాలు చెప్పండి. భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి. వాళ్ల పనులను వాళ్లే సొంతంగా చేసుకునేలా తీర్చిదిద్దండి. ఈమధ్య నేను చాలా మందితో మాట్లాడాను.

TNR

కరోనా విషయంలో ఫోన్ చేశాను. అప్పుడు వాళ్లు ఇంటి పెద్దలు చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఇంటి పెద్దలే భయపడటం ఇంట్లో వాళ్లకు మంచి కాదు. అలాగే రూమర్స్ నమ్మకండి. నెగెటివ్ వీడియోస్ చూడకండి. పాజిటివ్ గా ఉండండి. కచ్చితంగా కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి. మనం మెంటల్ గా డౌన్ అయిపోతే మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. మెంటల్ ఎబిలిటీ పెరగాలంటే ప్రాణాయామాలు చాలా అవసరం. అందరూ చేయండి’’ అని టీఎన్ఆర్ అనటంతో ఈ వీడియో ముగుస్తుంది.