MAA Elections: ముగిసిన మా పోలింగ్‌.. చరిత్ర‌లో ఇది తొలిసారి

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నిక ఈ రోజు ఉద‌యం 8గం.ల‌కు ప్రాంరంభం కాగా, కొద్ది సేప‌టి క్రితం ముగిసింది. రెండు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గాల్సిన పోలింగ్ ప‌రిస్థితుల దృష్ట్యా మూడు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగించారు. పోలింగ్‌ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

అయితే గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. మొత్తం 72 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు తెలుస్తుంది. మొత్తం మా ఓట‌ర్స్ 905 కాగా, 665 మంది ఓటు వేసిన‌ట్టు స‌మాచారం. సాయంత్రం 5గం.ల‌కు కౌంటింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, రాత్రి11 గంట‌లకు రిజ‌ల్ట్ రానుంది. అయితే అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన ప్యానెల్ స‌భ్యులు ఎవ‌రికి వారు త‌మ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గ‌తంలో కేవ‌లం 474 మంది మాత్ర‌మే ఓట్స్ వేయ‌గా, ఈ సారి గ‌ణ‌నీయంగా పెరిగింది. అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన ఇద్ద‌రు అభ్యర్ధులు చాలా స్ట్రాంగ్ ప‌ర్స‌న్స్ కావ‌డంతో ఓటర్స్ ఓటు వేసేందుకు ఎగ‌బ‌డ్డారు. ఇప్ప‌టికీ కొంద‌రు క్యూ లైన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. చివ‌రి నిమిషంలో అన‌సూయ ఓటు హ‌క్కు వినియోగించుకుంది. అయితే ఎన్నిక‌ల అధికారి గంట స‌మ‌యం పొడిగించిన నేప‌థ్యంలో ఓట‌ర్స్ అంద‌రు ఓటు వేసేందుకు రావాలని కోరారు.

సినిమా బంధువులందరికీ అంటూ .. ఓటు వేయడానికి ఎన్నికల అధికారి సమయం ఇస్తున్నారు అని తెలిపారు. ట్రాఫిక్ జామ్ కారణం గా మేము అర్థం చేసుకుంటున్నాము, చాలా మంది ఓటు వేయడానికి రాలేదు, దయచేసి వీలైన త్వరగా ఓటు వేయండి, ప్రతి ఓటును పరిగణనలోకి తీసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. అంతకు ముందు సోషల్ మీడియా వేదిక గా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.