Tollywood( దిగ్గజాల మనవళ్ళు ) : ఒకప్పుడు వారు నట దిగ్గజాలు. నటనలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారి ముందు నటించాలంటేనే ఎదుటి నటులు భయపడేవారు. వారు డైలాగ్ చెబుతున్నా… హావభావాలు పలికిస్తున్నా ఇట్టే చూస్తూ ఉండి పోవాల్సిందే. వారే నాగభూషణం, కాంతారావు, ఎస్వీ రంగారావు. ఈ ముగ్గురు నటులు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఉండేవారు. కానీ వారి వారసులు మాత్రం సినీ పరిశ్రమలో రాణించలేకపోయారు. వారి మనవళ్లు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. అంతగా రాణించలేకపోయారు.

సినీ పరిశ్రమలో నెపోటిజం పేరుతో కొత్తవారికి బయటి వారికి అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో ముందు తరంలో రాణించిన హీరోల వారసులే తర్వాత జనరేషన్ లో అవకాశాలు పొందతున్నారని.. మిగిలిన నటులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఇందుకు భిన్నంగా కొంత మంది నటుల వారసులు వెండితెరపై రాణించకుండానే కనుమరుగయ్యారు.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగభూషణం మనవడు. నాగభూషణం ఎంత పెద్ద నటుడో తెలియంది కాదు. విలన్ పాత్రలకు పెట్టింది పేరు నాగభూషణం. ఆయన కూతురు మీర్ అనే బాలివుడ్ దర్శకుడిని పెళ్లి చేసుకుంది. వారి కొడుకే సయ్యద్ అమీద్ భూషణ్. అయితే భూషణ్ మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. పలు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు బాలివుడ్ లో నాగభూషణం లానే అక్కడ మంచి విలన్ పాత్రల్లో నటిస్తున్నాడు.
తర్వాత చెప్పుకోవాల్సింది కత్తి కాంతారావు మనవడు గని గురించి. కాంతారావు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మనవుడు గని చిన్నతనంలోనే స్వాతిముత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. స్వాతిముత్యంలో కమల్ హాసన్, రాధికకు ధీటుగా నటించి పేరుతెచ్చుకున్నా.. పెద్దయ్యాక సినిమాల్లో నటించలేదు.
నటనా విశ్వరూపం ఎస్వీరంగారావు కూడా అంతే. ఎస్వీరంగారావు తన నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఆయనకు ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ తో సమానంగా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అయితే రంగారావు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించకుండానే ఎస్వీరంగారావు కన్నుమూశారు.