థియేట‌ర్లు తిరిగి తెరుచుకోవ‌డంపై వీడిన సందిగ్ధ‌త‌.. పెద్ద తెరపై బొమ్మ ఎప్ప‌టినుండి ప‌డ‌నుందంటే..!

సినీ ప‌రిశ్ర‌మ వేలాది మందికి జీవనాధారం. దీనిపై కొన్ని ల‌క్ష‌ల మంది కుటుంబాలు ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి.క‌రోనా దెబ్బకు షూటింగ్స్ బంద్ కావ‌డం, థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు చాలా ఇబ్బంది ప‌డ్డారు. సీసీసీ కొంత సాయం చేసిన‌ప్ప‌టికీ వారి ప‌రిస్థితి ద‌య‌నీయంగానే ఉంది. అయితే నెల రోజుల క్రితం షూటింగ్స్ మొద‌లు కావ‌డం, వారికి చేతి నిండా ప‌ని దొర‌క‌డంతో క‌ళ్ళ‌ల్లో కాస్త వెలుగు క‌నిపిస్తుంది. ఇక సినిమాలు లేక‌పోవ‌డంతో థియేట‌ర్స్ తెర‌చుకునే ప‌రిస్థితి లేదు. ఏదో పాత సినిమాల‌తో న‌డిపాద్దామ‌న్నా కూడా క‌రోనా టైంలో ఎవ‌రు రార‌నే భ‌యంతో యాజ‌మాన్యాలు తెరిచే ధైర్యం చేయ‌డం లేదు.

తెలంగాణ ప్రభుత్వం కరోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ థియేట‌ర్స్ తెర‌చుకోవ‌చ్చ‌ని ఎప్పుడో చెప్పిన‌ప్ప‌టికీ యాజ‌మాన్యాలు మాత్రం సందిగ్ధంలోనే ఉన్నాయి. వచ్చే ఆదాయం క‌న్నా పెట్టాల్సిన ఖ‌ర్చు ఎక్కువ‌వుతుందేమోన‌ని ఇన్నాళ్లు ఆలోచించారు. అయితే డిసెంబ‌ర్ 4 నుండి అన్ని థియేట‌ర్స్ తెరిచేందుకు థియేట‌ర్ యాజ‌మాన్యాలు సిద్ద‌మైన‌ట్టు స‌మాచారం. ఏషియ‌న్ గ్రూప్స్‌తో క‌లిసి మ‌హేష్ నిర్మించిన ఏఎంబీ సినిమాస్ మాత్రం డిసెంబ‌ర్ 4 నుండి అందుబాటులో ఉండ‌నుంది.

కొద్ది సేప‌టి క్రితం ఏఎంబీ సినిమాస్ డిసెంబరు 4న తెరిచేందుకు సిద్దంగా ఉన్నాం. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ప్రకటించింది. దీనికి కొందరు హీరోలు హర్షం వ్యక్తం చేశారు. సినీ ప్రియులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద తెర‌పై పండ‌గ చేసుకోబోతున్నాం అంటూ తెగ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఇప్ప‌టికే మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సోలో బ్రతుకే సో బెట‌ర్ అనే చిత్రం డిసెంబ‌ర్ 25న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నాం అని ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి ముందు ఇంకా ఏమైన సినిమాలు విడుద‌ల అవుతాయా, లేదంటే పాత సినిమాల‌తోనే కొన్నాళ్లు న‌డిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement