THAMAN: తమన్ పెద్ద మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్
Samsthi 2210 - May 6, 2021 / 07:56 AM IST

మాయదారి కరోనా వైరస్ ఎన్నో వేల కుటుంబాలలో చిచ్చు పెడుతుంది. అయ్యే వాళ్లను ఆప్తులను కోల్పోయి లక్షలమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడ కూడా చాలా మంది మరణించారు. కొందరు ప్రముఖులు ఉంటే.. మరికొందరు చిన్నవాళ్లు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు అనగానే అందరి దగ్గర డబ్బులు ఉండవు. ఇక్కడ కూడా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇందులో చాలా మందికి పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. అలాంటి వాళ్లు కూడా ఇప్పుడు ఈ కరోనా వైరస్ ధాటికి బలైపోతున్నారు.
తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తమన్ సహా చాలామంది సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేసిన కమల్ కుమార్ ఈ మధ్య కరోనాతో మరణించాడు. ఈయన చనిపోయిన విషయం తెలుసుకొని చాలామంది సంగీత దర్శకులతో పాటు.. ఆయనతో పరిచయం ఉన్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కమల్ ది పేద కుటుంబం కావడం.. ఆ కుటుంబంలో పోషించేవాడు కూడా ఈయనే కావడంతో కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఇప్పుడు వాళ్ళ అందరి కంటే సంగీత దర్శకుడు తమన్ మరింత ఉదారంగా ప్రవర్తించాడు.
ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా అండదండగా నిలబడతానని మాటిచ్చాడు. కమల్ కుమార్ కొడుకు చదువు బాధ్యతలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యత తాను తీసుకోవడానికి సిద్ధమయ్యాడు తమన్. తన దగ్గర పనిచేసిన కీబోర్డ్ ప్లేయర్ కావడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ సంగీత దర్శకుడు. చిన్న వయసులోనే కమల్ వెళ్లిపోవడం నిజంగానే అందరికీ బాధాకరం అంటూ సంతాపం వ్యక్తం చేశాడు. ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇలాంటి సేవా దృక్పథంలోనూ ముందున్నాడు తమన్. ప్రస్తుతం ఈయన దాదాపు 15 సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా తమన్ చేసిన సాయం చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.