SPB: బాలు.. ఇప్పటికి గుర్తొచ్చారా?. చాలు..

SPB: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయి 8 నెలలు దాటిపోయింది. వచ్చే శుక్రవారం అంటే జూన్ 4వ తేదీన ఆయన 75వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు చిత్ర సీమ ఆయనకు ఘనంగా నివాళి అర్పించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (కంటిన్యూగా 12 గంటల సేపు) బాలూకి స్వర నీరాజనం చేయనున్నారు. కాకపోతే అది ఆఫ్ లైన్ లో కాదట. ఆన్ లైన్ లో అట. అంటే జూమ్ మీటింగ్ మాదిరిగా. ఎవరింట్లో వాళ్లు ల్యాప్ టాప్ ముందో, కంప్యూటర్ల ముందో కూర్చొని ఛాయ్ తాగుతూ.. బిస్కెట్లు తింటూ.. మధ్య మధ్యలో బాత్ రూమ్ కి వెళ్లొస్తూ.. ఈ కార్యక్రమంలో ఏదో అలా.. అలా.. నామ్ కే వాస్తే పాల్గొంటారంట. హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, రైటర్స్ ఇలా అందరూ ‘‘బాలు’’పంచుకుంటారంట.

SPB

ఎంత మంచోళ్లో..

బాలూ గొప్పతనాన్ని కొలవటానికి గ్రేట్.. లెజెండ్.. వగైరా వగైరా పడికట్టు పదాలు చాలవు. అలాంటి మహామనిషి చనిపోయి ఇన్ని నెలలు గడిచిపోయాక ఆయనకు ఇప్పుడు తీరిగ్గా జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళి అర్పిస్తారంట. ఇన్ని రోజులూ వీళ్లంతా ఎక్కడికి పోయారు?. ఆయన ఇన్నాళ్లకు గుర్తొచ్చారా?. టాలీవుడ్ లోని మామూలు వ్యక్తులు చనిపోతేనే సంస్మరణ సభలు పెట్టి ఆహా ఓహో అంటారే. అలాంటిది బాలూ గారు తెలుగు చలన చిత్ర రంగానికి అందించిన అసమాన సేవల గురించి చెప్పటానికి కనీసం ఒక్క రోజైనా కేటాయించకపోవటం, సభ పెట్టకపోవటం ఘోరాతి ఘోరం.

SPB

పాటకు ప్రాణం.. ఉన్నంత కాలం..

ఆఫ్ కోర్స్.. ఎస్పీ బాలూ విశిష్టతను వివరించటానికి వీళ్లకెవరికీ అర్హత లేదేమో అనిపిస్తోంది. అందుకే ధైర్యం చేసి ఎవరూ ముందుకు రాలేదేమో అని జనం అనుకుంటున్నారు. అయినా వీళ్లు బాలూ గురించి కొత్తగా చెప్పేదేముంది?. శ్రోతలు తమ మనసులో బాలూకి కట్టుకున్న గుడిలో నిత్యం ఆయనను కొలుస్తూనే ఉంటారు. పాట ఉన్నంత కాలం.. పాటకు ప్రాణం ఉన్నంత కాలం.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సజీవంగా, చిరంజీవిలా, ఇంటింటా ఒక ‘‘బాలు’’డిలా, అందర్నీ అలరిస్తూనే ఉంటారు.

SPB