PAWAN KALYAN: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్‌కు టైం ఫిక్స్.. ఆ రోజు ప‌వ‌న్ అభిమానుల‌కు పూన‌కాలే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న త‌ర్వాతి సినిమాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ విడుదలకానుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

తొలి సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో సినిమా చేస్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2022 లో మూవీని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మ‌రోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు.