ICC T20: పాక్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన తాలిబ‌న్స్.. మ్యాచ్‌లు య‌ధాత‌థం

ICC T20: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఏ పని చేయాల‌న్నా కూడా తాలిబ‌న్ల అనుమ‌తి త‌ప్పనిస‌రి. పొరుగుదేశ‌మైన పాక్‌తో శ్రీలంక వేదిక‌గా వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుండ‌గా, తాలిబ‌న్ల రాకతో ఆ మ్యాచ్‌పై అనేక అనుమానాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సిరీస్ య‌ధావిధిగా జ‌రుగుతుంద‌ని పాకిస్తాన్ బోర్డ్ తేల్చేసింది. సెప్టెంబర్ 1 నుండి 5 వ‌ర‌కు శ్రీలంక‌లోని హంబాంటోటా వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపింది.

2023లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ టీ 20 ప్ర‌పంచ క‌ప్ క్వాలిఫ‌యింగ్ లీగ్‌గా దీనిని ప‌రిగ‌ణిస్తుండ‌గా, ఆఫ్ఘ‌నిస్తాన్ లో క‌మ్ముకున్న నీలి నీడ‌ల వ‌ల‌న మ్యాచ్ జ‌రుగుతుందా లేదా అనే సందేహం అంద‌రిలో క‌లిగింది.అయితే తాలిబన్స్ నుండి ఆమోదం ల‌భించింద‌ని పాక్ బోర్డ్ ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు.

తాలిబ‌న్ అధికారుల నుండి వ‌న్డే సిరీస్ నిర్వ‌హించ‌డానికి అంగీకారం వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మా టీం వెస్టీండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. దాని త‌ర్వాత ఆట‌గాళ్లను ఎంపిక చేస్తాం అని పీసీబీ అధికారి పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌ని నిర్వ‌హించ‌డం ద్వారా తాలిబ‌న్స్ ప్ర‌పంచ దేశాల‌కు సానుకూల సందేశం పంపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్‌ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. గ‌తంలో పోలిస్తే తాలిబ‌న్ల పాల‌న బాగుంటుంద‌నే విష‌యాన్నిఓ క్రికెట్ విశ్లేష‌కుడు చెప్పుకొచ్చారు.ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్ ఆట‌గాళ్లు అయిన ర‌షీద్ ఖాన్, ముజీబుర్ రెహ‌మాన్ లాంటి వాళ్లు ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న విష‌యం తెలిసిందే.