JR NTR: బుల్లితెర‌పై స‌రికొత్త గేమ్ షో మొద‌లు పెట్టిన ఎన్టీఆర్.. ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంటి?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లో ఎంత టాలెంట్ ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆఫ్ స్కీన్ అయిన ఆన్ స్క్రీన్ అయిన అద‌రగొట్ట‌డం ఆయ‌న వంతు. బిగ్ స్క్రీన్ అయిన స్మాల్ స్క్రీన్ అయిన సెన్సేష‌న్స్ క్రియేట్ చేయ‌డం ఆయ‌న స్పెషాలిటి. గ‌తంలో బిగ్ బాస్ షో కార్య‌క్ర‌మంతో సంచ‌లనాలు సృష్టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే రియాలిటీ గేమ్ షోని మొద‌లు పెట్ట‌డానికి సిద్ద‌మ‌య్యారు. కొద్ది రోజుల క్రితం ఈ షోకి సంబంధించి విలేక‌రులు అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు ఇచ్చారు ఎన్టీఆర్. అయితే కరోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ఈ షో ఊసే లేకుండా పోయింది.

మా టీవీలో వ‌చ్చిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు గేమ్ మాదిరిగా ”ఎవరు మీలో కోటీశ్వరులు” అనే రియాలిటీ గేమ్ షో ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్.. జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలతో ‘ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. గేమ్‌కు సంబంధించి కొన్ని ప్ర‌శ్న‌లు కూడా అడిగారు. ఇక షో స్టార్ట్ అవుతుంద‌ని అనుకునే స‌మ‌యంలో క‌రోనా ఉదృతి పెరిగిపోవ‌డంతో ఈ గేమ్ షో ని క్యాన్సిల్ చేశారనే రూమర్స్ కూడా వచ్చాయి.

కరోనా రెండవ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం నిర్వాహకులకు కష్టంగా మారినట్లు సమాచారం. ఈ ప‌రిస్థితుల‌లో షూటింగ్ చేయ‌డం కూడా ఇబ్బంది అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే గేమ్ షోని క్యాన్సిల్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే అవ‌న్నీ పుకార్లేన‌ని త్వ‌ర‌లోనే ఈ షో మ‌ళ్లీ మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది . క‌రోనా ప్రభావం తగ్గితే ఆగస్టులో ”ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే తారక్ ఈ షో కోసం సుమారు 10 కోట్ల రూపాయలు అందుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒక‌వైపు ఈ షో చేస్తూనే మ‌రో వైపు ఆర్ఆర్ఆర్, కొరటాల మూవీ, ప్ర‌శాంత్ నీల్ మూవీల‌ను ఎన్టీఆర్ చేయ‌నున్నాడు. కాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌లే క‌రోనా నుండి కోలుకున్న విష‌యం తెలిసిందే.