sumanth ashwin : టాలీవుడ్‌లో మ‌రో వివాహం.. కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నున్న పెళ్లి

sumanth ashwin : గ‌త ఏడాది టాలీవుడ్‌లో సెల‌బ్రిటీలు వ‌రుస‌గా పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నుండి మొద‌లు పెడితే రానా, నిఖిల్‌, నితిన్, కాజ‌ల్‌, నిహారిక ఇలా చాలా మంది సెల‌బ్స్ ప‌రిణ‌యమాడారు. ఇప్పుడు మ‌రో సెల‌బ్రిటీ పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ద‌మయ్యాడు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, న‌టుడు సుమంత్ అశ్విన్ … దీపిక అనే యువ‌తిని ఫిబ్ర‌వ‌రి 13న వివాహం చేసుకోబోతున్నాడు. హైద‌రాబాద్‌లోనే ఈ వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఈ వేడుక‌కు కొద్ది మంది స‌న్నిహితుల‌ని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది.

క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సుమంత్ అశ్విన్ పెళ్లి వేడుక‌ని జ‌రిపేలా సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమంత్ పెళ్లి వేడుక‌కు సంబంధించి ఎంఎస్ రాజు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌గా, ఇందులో మన ప్రియ‌మైన వాళ్ల‌ను క‌ల‌వ‌డం క‌న్నా గొప్ప ఆనందం ఏముంటుంది. అసాధార‌ణ స‌మ‌యం మ‌నంద‌రిని క‌లుసుకోనివ్వ‌డం లేదు. మీరంద‌రు నూత‌న దంప‌తుల‌ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం. దంప‌తుల‌కు మీ ప్రేమ‌, ఆశీర్వాదాలు ఉంటాయ‌ని ఆశిస్తున్నాం అంటూ ఎంఎస్ రాజు ఆయన సతీమణి సుధా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

టాలీవుడ్‌లో మంచి ద‌ర్శ‌క నిర్మాత‌గా ఎదిగిన ఎమ్మెస్ రాజు శత్రువు, దేవి, దేవీ పుత్రుడు, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం లాంటి సంచలన సినిమాలు అందించాడు .మనసంతా నువ్వే లాంటి సినిమాలకు కథలు కూడా అందించాడు రాజు. అయితే మెల్లగా ఆయన హవా తగ్గుతూ వ‌స్తుండ‌గా, ఇటీవ‌ల పూర్తిగా ఎరోటిక్ థ్రిల్లర్ డ‌ర్టీ హ‌రి అనే డ్రామాతో యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం చేసాడు. ఈ సినిమా యూత్‌కు మంచి వినోదం అందించింది. ఇక తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోనే తూనీగ తూనీగ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. దిల్ రాజు నిర్మించిన కేరింత.. ఇంద్రగంటి తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుతి కథ అందించిన లవర్స్ కూడా సుమంత్ అశ్విన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Advertisement