Ileana: ఇలియానాపై బ్యాన్ విధించారా.. ఇందులో నిజ‌మెంత‌?

Ileana: గోవా బ్యూటీ ఇలియానా త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ లో దశాబ్ధం పైగా కెరీర్ ని సాగించిన ఇలియానా ఉన్న‌ట్టుండి బాలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ ఇలియానా న‌టించిన చిత్రాల‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. బర్ఫీ లాంటి క్రేజీ సినిమాలో నటించినా కానీ ఎందుకనో ఆ తర్వాత పెద్ద రేంజు స్టార్లు తనని ఎంపిక చేయలేదు. దీంతో ఇలియానా మ‌ళ్లీ తెలుగు- త‌మిళ సినిమాల‌పైనే దృష్టి పెట్టింది. కొంత కాలంగా ఇలియానా సినిమాల‌కు సంబంధించిన వార్త‌లు రాక‌పోవ‌డంతో ఆమెపై బ్యాన్ విధించార‌నే టాక్ వినిపిస్తుంది. ఇది నిజ‌మేనంటూ ఒక సీనియర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Ileana

దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బేబీ ఇలియానా.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలందరితో నటించింది. మ‌ధ్య‌లో ఈ అమ్మడు ప్రేమ‌లో ప‌డ‌గా, ఆ ప్రేమ విఫ‌లం అయింది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రయత్నాలు చేసినా ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. బరువు పెరగడంతో స‌న్న‌బ‌డేందుకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇక మళ్ళీ లైన్ లోకి వచ్చి ఆమె పాగల్ పత్ని అనే సినిమా , అభిషేక్ బచ్చన్‌‌తో ‘బిగ్‌ బుల్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మొన్నీమధ్యనే మూవీ ఓటీటీలో రిలీజ్‌‌ కూడా అయింది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

ఇక ఇలియానా తెలుగులో చివ‌రిగా ర‌వితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో న‌టించింది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో అమ్మ‌డికి టాలీవుడ్ ఆఫ‌ర్స్ కరువ‌య్యాయి. అయితే సౌత్ ఇండ‌స్ట్రీపై ఇలియానా ఫోక‌స్ పెట్ట‌డం లేద‌ని , బాలీవుడ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంద‌ని అంద‌రు అంటున్న నేప‌థ్యంలో ఆమె ఇక్క‌డ సినిమాలు చేయ‌క‌పోవ‌డం వెనుక వేరే కారణం ఉందని తెలుగు దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వెల్లడించారు. దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఆమె నటరాజన్ అనే తమిళ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ విషయంలో గొడవ పడింది.

Ileana

విక్రమ్ హీరోగా నబ్బన్ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ఇలియానా ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న ఇలియానాను తిరిగి ఇవ్వ‌మ‌ని కోర‌గా ఆమె స‌సేమిరా అంది. దీంతో ఈ విష‌యాన్ని త‌మిళ నిర్మాత‌ల మండ‌లి దృష్టికి తీసుకెళ్ల‌గా అక్క‌డ ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ వ్యవహారం వచ్చింది. అయితే ఆమె మీద అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా తమ సినిమాలలో ఎవరూ ఆమె తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని కాట్రగడ్డ ప్రసాద్ వివరించారు. ఈ కార‌ణంగానే 2012 తర్వాత ఇలియానా ఒక్క దక్షిణాది సినిమా కూడా చేయలేక పోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం రణదీప్ హుడా హీరోగా నటిస్తున్న అన్ఫెయిర్ & లవ్లీ సినిమాలో నటిస్తోంది.