Soundarya: త్వ‌ర‌లోనే సౌంద‌ర్య బ‌యోపిక్ .. లీడ్ రోల్ పోషించేది ఎవ‌రంటే..!

Samsthi 2210 - July 19, 2021 / 10:52 AM IST

Soundarya: త్వ‌ర‌లోనే సౌంద‌ర్య బ‌యోపిక్ .. లీడ్ రోల్ పోషించేది ఎవ‌రంటే..!

Soundarya ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తుంది. సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల జీవితాల‌కి సంబంధించి అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా అల‌నాటి మ‌హాన‌టుల జీవితాల‌ని నేటి త‌రానికి ప‌రిచ‌యం చేసే ఉద్దేశంతో వైవిధ్యంగా బ‌యోపిక్స్ రూపొందిస్తున్నారు. మ‌హాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో నాగ్ అశ్విన్ మ‌హాన‌టి అనే సినిమా చేయ‌గా,ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది.

ఇక దివంగ‌త న‌టి సౌంద‌ర్య బ‌యోపిక్ కూడా రాబోతుందని ఎప్ప‌టి నుండో ప్ర‌చారం న‌డుస్తుంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌంద‌ర్య బ‌యోపిక్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు సౌంద‌ర్య‌. జులై 18న ఈమె 49వ జయంతి. ఈ సంద‌ర్భంగా సౌంద‌ర్య బ‌యోపిక్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సౌంద‌ర్య మ‌ర‌ణించి దాదాపు 17 ఏళ్లు అవుతున్నప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆమె అంద‌రి హృద‌యాల‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉంది. పెళ్లై ఏడాది కూడా కాకముందే సౌంద‌ర్య ప్ర‌మాదంలో క‌న్నుమూసింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో దాదాపు 100కు పైగా సినిమాలు చేసిన సౌంద‌ర్య త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. క‌న్న‌డ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలు చేసింది.

మహానటి సంచలన విజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా దక్కించుకుంది. ఎన్టీఆర్,వైఎస్ఆర్ బ‌యోపిక్స్‌కి కూడా మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు సౌంద‌ర్య బ‌యోపిక్ కోసం కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. సౌంద‌ర్య అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్‌గా చనిపోయే వరకు కూడా ఉంది.

సౌందర్య సినిమాలే కాదు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తోను అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గిన ముద్ర వేసుకుంది. మెడికల్ కాలేజ్‌తో పాటు స్కూల్స్ కూడా కట్టించి ఉచిత విద్యను అందించింది. ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తుంది. అప్పటి లెక్కల ప్రకారమే 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.

సౌంద‌ర్య మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబ స‌భ్యులు ఆస్తుల కోసం కొట్టుకున్నారు. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు. 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది.

సౌందర్య జీవితంలో అత్యంత కీలకంగా ఉన్న 1990 నుంచి 2004 వరకు ఆ 14 ఏళ్లు కీలకంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సౌందర్య బయోపిక్ చేస్తారనే కన్నడనాట ప్రచారం జోరందుకుంటుంది. సౌంద‌ర్య బ‌యోపిక్ చేస్తే అది త‌ప్ప‌క సంచ‌ల‌నం అవుతుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us