Aakasam nee haddura సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం సూరరై పోట్రు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథతో రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని ముందుగా థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కాని కరోనా వలన థియేటర్స్ మూతపడడంతో తప్పక అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపించారు. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ఈ మూవీని ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా సూర్య నటన, సుధా కొంగర టేకింగ్‌కు మంత్రముగ్ధులయ్యారు.
కరోనా సమయంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వి చిత్రం, పెంగ్విన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులకు నిరాశ కలిగించాయి. అలాంటి సమయంలోనే ఆకాశం నీ హద్దురా అనే చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాకు వచ్చిన మౌత్ పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంతో ఆ సినిమాని ఎగబడి మరీ చూశారు. థియేటర్లో ఈ సినిమాని విడుదల చేస్తే ఇంకా మంచి మజా ఉండేదని అనుకున్నారు. సూర్య కొన్నాళ్లుగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ వస్తుండగా, ఈ చిత్రం అందించిన విజయం మంచి బూస్టప్ ఇచ్చింది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియాలిటీకి దగ్గరగా అద్భుతంగా చిత్రీకరించారు. సూర్య నటన అద్భుతం అని కొనియాడారు. అయితే ఎందరో ప్రశంసలు అందుకొని తమిళ సినీ ఇండస్ట్రీ గర్వించదగిన సినిమాగా నిలిచిన ఈ సినిమాకు తాజాగా గొప్ప గౌరవం దక్కింది. ఆస్కార్ రేసులో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లాంటి కేటగిరీల్లో ఆస్కార్ బరికి ఎంపికైంది. ఈ సినిమాను మంగళవారం అకాడమీ స్క్రీనింగ్ రూమ్‌లో మంగళవారం ప్రదర్శించారు కూడా. ఆకాశం నీ హద్దురా సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం పట్ల చిత్ర బృందంతో పాటు అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.