TNR: టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థికసాయం చేసిన పలు ఆన్ లైన్ మీడియా సంస్థలు

TNR: వివిధ వర్గాల ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసులను గెలిచిన స్టార్ జర్నలిస్ట్ టీఎన్ఆర్. ఆయన ఇటీవల భౌతికంగా దూరం కావటం అటు అభిమానులను ఇటు బంధు మిత్రులను తీవ్రంగా కలచి వేస్తోంది. గొప్ప సన్నిహితుణ్ని, శ్రేయోభిలాషిని కోల్పోయామనే బాధ వాళ్లను అనుక్షణం వెంటాడుతోంది. సినిమా పరిశ్రమతోపాటు మీడియా రంగంలో టీఎన్ఆర్ అనేక మంది ఆత్మీయుల్ని సంపాదించుకున్నారు. వాళ్లతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకున్నారు. దీంతో ఆ స్నేహితులు టీఎన్ఆర్ పైన తమకు గల ప్రేమను, అనురాగాన్ని ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల పట్ల చూపుతున్నారు. ఈ క్రమంలో పలు పాపులర్ ఆన్ లైన్ మీడియా సంస్థలు టీఎన్ఆర్ ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు.

TNR Family

తాజాగా..

సుమన్ టీవీ ఎండీ సుమన్ గారు, ఈగల్ మీడియా ఎండీ సముద్రం శ్రీనివాస్ గారు, ఫిల్మ్ ట్రీ మీడియా అధిపతులు సీవీజీ రావు గారు మరియు అంజి గారు, సీ క్యూబ్ మీడియా ఎండీ వంశీకృష్ణ గారు టీఎన్ఆర్ కుటుంబానికి విలువైన ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మారుతి, నటుడు సంపూర్ణేష్ బాబు, టీఎన్ఆర్ పనిచేసిన సంస్థ ఐడ్రీమ్ మీడియా ఫౌండర్ అండ్ చైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి గారు పెద్దఎత్తున ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. టీఎన్ఆర్ పిల్లల చదువుల బాధ్యతను కూడా చిన్న వాసుదేవ రెడ్డి గారు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. టీఎన్ఆర్ హఠాన్మరణంతో దిగ్ర్భాంతికి గురైన ఫ్రెండ్స్ కొందరు ఆయన పిల్లల భవిష్యత్ కోసం ఫండ్ సేకరించాలని నిర్ణయించుకున్నారు. చిన్న వాసుదేవ రెడ్డి గారికి తెలిసిన వ్యక్తి స్వాతి కారంచేటి ద్వారా అమెరికాలో ‘గో ఫండ్ మి’ సైతం ఇప్పటికే రూ.10 లక్షలను సేకరించింది.

TNR Family

‘‘ఫ్రాంక్లీ’’గా చెప్పాలంటే..

మీడియాలో ఒక వెలుగు వెలుగుతూ సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకున్న టీఎన్ఆర్ ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండేవారు. కానీ సంపాదన ఏ స్థాయిలో ఉండేదో అనుకోని ఖర్చులూ అదే స్థాయిలో వచ్చిపడ్డాయి. అక్క కూతురి పెళ్లి కోసం టీఎన్ఆర్ చాలా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. సోదరికి కొవిడ్ సోకటంతో ఆమెకి హాస్పిటల్ బిల్లంతా ఆయనే చెల్లించారని సమాచారం. ఈవిధంగా టీఎన్ఆర్ తన సంపాదన మొత్తాన్ని అయినవారికోసం ఖర్చుపెట్టి మంచి మనసు చాటుకున్నారు.

TNR Family