TOLLYWOOD: సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ఎఫెక్ట్.. ఎన్ని సినిమాలు వాయిదా ప‌డ్డాయో తెలుసా?

క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను కుదేలు చేస్తుంది. గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న తొమ్మిదినెల‌ల పాటు పరిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. త‌ప్పని ప‌రిస్థితుల‌లో కొన్ని సినిమాలు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. అయితే రిలీజ్‌కు సిద్ధవుతున్న స‌మ‌యంలో క‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత విజృంభిస్తుండ‌డంతో అన్ని సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డింది. అలానే థియేట‌ర్స్ మూసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా సినిమాల రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. మ‌రి వాయిదా ప‌డిన సినిమాలు జాబితా చూస్తే..

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం ”లవ్ స్టోరీ . సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. ఇక నేచురల్ స్టార్ నాని – రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు శివ నిర్వాణ తెరక్కించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క‌రోనా వ‌ల‌న ఈ మూవీ వాయిదా ప‌డింది. రానా దగ్గుబాటి – సాయి పల్లవి జంటగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా ”విరాట పర్వం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. చివరకు కోవిడ్ ఎఫెక్ట్ పడటంతో వెనక్కి తగ్గారు.

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ”ఆచార్య. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాని రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు.విక్టరీ వెంకటేష్ – దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ”నారప్ప. మే 14న విడుదల కావ‌ల‌సిన ఈ చిత్రం వాయాదా ప‌డింది. ర‌వితేజ ఖిలాడీ, గోపిచంద్ సీటీమార్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ న‌టించిన పాగ‌ల్ , సంతోష్ శోభన్ – కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఏక్ మినీ కథ, యువ హీరో తేజా సజ్జా – ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా న‌టించిన ఇష్క్ ఇలా ప‌లు చిత్రాలు వాయిదా ప‌డ్డాయి.