Pushpa New Song:పుష్ప నుండి శ్రీ వ‌ల్లి సాంగ్ ప్రోమో విడుద‌ల .. పెరుగుతున్నఅంచ‌నాలు

Pushpa New Song: అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేష‌న్ అంటే అభిమానుల‌లో ఏ రేంజ్ అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికే ఈ కాంబినేష‌న్‌ల ఆర్య‌, ఆర్య‌2 చిత్రాలు రాగా, అవి మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తుండగా.. తొలి భాగం ‘పుష్ప-ది రైజ్’ ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది.

చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మూవీ నుండి ప‌లు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల చేయ‌గా, వాటికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ అనే పాట మరో రేంజ్‌లో అదరగొట్టింది. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించారు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ రేపు విడుద‌ల కానుండ‌గా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల చేశారు. ఇది ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

హీరోయన్‌గా రష్మిక మందన పోషిస్తున్న ‘శ్రీవల్లి’ పాత్రపై రూపొందించిన ఈ పాట ప్రోమోలో ‘చూపే బంగారమయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ పాట 19 సెకన్ల ప్రోమోని వదిలి ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. ఇక ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు.

పాటలోని రెండు లైన్లే ఇంత బాగుంటే ఇక పాట ఎంత బాగుంటుందో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ఫహాద్ పాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.