Vivek: ఆ క‌మెడీయ‌న్ టీకా వ‌ల‌న చ‌నిపోయాడా.. అస‌లు నిజం ఏంటి ?

Vivek: ప్ర‌ముఖ హాస్య న‌టుడు వివేక్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివేక్‌ దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు.

Vivek

దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌తో కలిసి నటించిన వివేక్‌ హాస్యం పంచారు. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ వచ్చాయి. ‘అపరిచితుడు’లో విక్రమ్‌ స్నేహితుడిగా, రజనీ శివాజీలో ఆయన మేనమామగా క‌నిపించి మెప్పించాడు.

‘రఘు వరన్‌ బీటెక్‌’లో ధనుష్‌ సహచరుడిగా ‘స్వర్ణపుష్పం’ అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీ‌రో సూర్యతో కలిసి ‘సింగం 2’లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు. ‘బాయ్స్‌’ చిత్రంలోనూ నటించారు. ఈఏడాది ఏప్రిల్‌ 17న గుండెపోటుతో వివేక్ కన్నుమూయ‌గా, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే వివేక్‌ చనిపోవడంతో.. టీకా వికటించి ఆయన మృతి చెందారనే అనుమానాలు రేకెత్తాయి.

దీంతో తమిళనాడులోని విజుపురానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త.. టీకా పొందడం వల్లే వివేక్‌ చనిపోయారా? అనే కోణంలో విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం.. తాజాగా ఈవిషయంపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది.

వివేక్‌ చనిపోవడానికి రెండు రోజుల మందు టీకా తీసుకున్నారని… ఆపై సడెన్‌గా గుండెపోటు రావడంతో మృతిచెందారని తెలిపింది. ఆయన చనిపోవడానికి టీకాకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈవిషయంపై అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌ కమిటీ (ఏఈఎఫ్‌ఐ) వివరణ ఇచ్చింది.