Sharwanand : శర్వానంద్ బర్త్‌డే స్పెషల్ : మహా సముద్రం నుండి స్టన్నింగ్ లుక్ విడుదల
Samsthi 2210 - March 6, 2021 / 11:43 AM IST

Sharwanand : ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు మల్టీ స్టారర్ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. ఇందులో ఒకటి మహా సముద్రం. శర్వానంద్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. లాక్‌డౌన్ వలన చిత్ర షూటింగ్ వాయిదా పడగా, మూవీ రిలీజ్ కూడా లేట్ అయింది. ఆగస్ట్ 19న చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకొస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్.
ఏడేళ్ల తర్వాత సిద్ధార్ద్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించనున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా మూవీ నుండి ఆయన లుక్ విడుదల చేశారు. ఇందులో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు శర్వా. పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నట్టు అర్ధమవుతుంది.
ప్రస్తుతం శర్వానంద్ మహా సముద్రం చిత్రంతో పాటు శ్రీకారం, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీకారం చిత్రం మార్చి 11న విడుదల కానుండగా, ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి రైతుగా మారి పేద ప్రజలకు ఎలా సేవ చేస్తాడనేది ట్రైలర్ ద్వారా ఆసక్తిగా చూపించారు.ఈ ట్రైలర్‌ను నాని, నితిన్, వరుణ్ తేజ్ తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మరోవైపు శర్వానంద్ ..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగా, ఇందులో రష్మిక మంధాన కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరి కొద్ది నిమిషాలలో విడుదల కానుంది.