INDIAN 2: స‌మ‌సిపోని ఇండియ‌న్ 2 వివాదం.. క‌థ మ‌ళ్లీ మొద‌టికి చేర‌డంతో బాధ‌లో ఫ్యాన్స్

ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్, స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం భార‌తీయుడు. వేరే భాష‌ల‌లో ఇండియ‌న్ 2 పేరుతో ఈ చిత్రం విడుద‌లైంది. అప్ప‌ట్లో ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అవినీతి గురించి పోరాడు వ్య‌క్తిగా క‌మ‌ల్ న‌ట విన్యాసం న‌భూతో న‌భ‌విష్య‌త్ అనేలా సాగింది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లే కాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ఈ చిత్రానికి ద‌క్కాయి. ఈ చిత్రం సీక్వెల్ గురించి ఎప్ప‌టి నుండో చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ, మూవీ ప‌ట్టాలెక్కేందుకు చాలా టైం ప‌ట్టింది.

2020లో భార‌తీయుడు 2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు మేక‌ర్స్. చిత్రం ఏ ముహూర్తాన ప్రారంభ‌మైందో కాని అన్ని అడ్డంకులే. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం బారిన ప‌డి ప‌లువురు అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ మృతి చెంద‌డంతో సినిమా కొన్నాళ్లు ఆగింది. ఆ త‌ర్వాత క‌రోనా వ‌ల‌న ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో మూవీ మ‌ళ్లీ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇంత‌లో నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల మ‌ధ్య గొడ‌వ‌. చెప్పిన బడ్జెట్లో సినిమా కంప్లీట్ చెయ్యలేదని లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, అవసరమైనంత బడ్జెట్ ఇవ్వలేదని శంకర్ వాదులాడు కోవడంతో సినిమా ఆగిపోయింది. లాక్‌డౌన్ త‌ర్వాత కూడా సినిమా మొద‌లు కాలేదు.

రీసెంట్‌గా లైకా నిర్మాత‌లు ఈ వివాదంపై కోర్టుని ఆశ్రయించారు. ఇండియ‌న్ 2 సినిమా చేయ‌కుండానే శంక‌ర్ వేరే సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. భార‌తీయుడు 2 పూర్త‌య్యాకే శంక‌ర్ సినిమా చేసేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ కోర్టు అలా ఇవ్వడం కుదరదని అంటూ గొడవను సామరస్యంగా తేల్చుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది. దీంతో శంక‌ర్ లాయ‌ర్ రీసెంట్‌గా లైకా నిర్మాత‌ల‌ను క‌లిసి మూవీని జూన్ నుండి అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో పూర్తి చేస్తామ‌ని అన్నారు. కాని లైకా సంస్థ జూన్ వ‌ర‌కు పూర్తి చేయాల‌ని అంటుంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చర్చ‌లు విఫ‌లం కావ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

Advertisement