Savita Bajaj: ఈ న‌టి ప‌రిస్థితి దారుణం.. ఫ్యామిలీ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు!

Savita Bajaj వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఎంత హుంద‌గా బ్ర‌తికిన వృద్ధాప్యంలోకి వ‌చ్చేసరికి నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడ‌డం, కుటుంబ స‌భ్యులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బ్ర‌తికి ఉండ‌గానే న‌ర‌కం చూడాల్సి వ‌స్తుంది. సినిమా సెల‌బ్రిటీలలో కొంత మంది ఇలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కోగా, వారు త‌మ ప‌రిస్థితుల‌ని గురించి చెప్పి క‌న్నీరు పెట్టిస్తున్నారు.

సీనియర్‌ నటి సవితా బజాజ్ .. ‘నిశాంత్‌’, ‘నజ్రానా’, ‘బెటా హోతో ఐసా’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ప్రేక్ష‌కుల‌కి ఈమె చాలా సుప‌రిచితం. ఒక‌ప్పుడు బాగా బ్ర‌తికిన ఈమె ప్ర‌స్తుతం క‌ష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ఓ వైపు అనారోగ్యం, మ‌రోవైపు అయిన‌వాళ్లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ న‌టి ప‌రిస్థితి దైన్యంగా మారింది.

తాజాగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన స‌వితా .. “నేను సంపాదించి కూడబెట్టినదంతా ఊడ్చుకుపోయింది. ఆ డబ్బంతా నా వైద్యం కోసమే ఖర్చు పెట్టాను. ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు చాలవన్నట్లు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడేం చేయాలో కూడా పాలు పోవడం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. కిచెన్ రూంలో అద్దెకు ఉంటున్నాను.

చిన్న రూంకే ఏడు వేల రూపాయ‌లు అద్దె క‌డుతున్నాను. 2016లో నేను ఓ ప్రమాదంలో గాయపడినప్పుడు సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (CINTAA) రూ.50 వేలు, రైటర్స్‌ అసోసియేషన్‌ లక్ష రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు నా ఆర్ధిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు అప్పు తీసుకున్నా కూడా న‌టించి వ‌చ్చిన మొత్తాన్ని వారికి ఇచ్చేదాన్ని కాని ఇప్పుడు న‌టిస్తాన‌న్న న‌మ్మ‌కం కూడా లేదు.

నా దుర‌దృష్టం కొద్ది నా బాగోగులు చూసుకోవ‌డానికి ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. 25 ఏళ్ల క్రితం ఢిల్లీ వెళ్లాల‌ని అనుకున్నా. కాని ఎవ‌రు న‌న్ను చేర‌దీయ‌ద‌ల‌చుకోలేదు. ఎంతో సంపాదించాను, కుటుంబం కోసం మరెంతో ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు ఒంటరినై సాయం కోసం అర్థించాల్సిన దుస్థితికి చేరుకున్నాను” అని నటి ఎమోషనల్‌ అయింది.కాగా, ఇటీవ‌ల న‌టి ష‌గుప్త అలీ వైద్యం కోసం బంగారు న‌గ‌లు, కారు అమ్మేయ‌గా ఈ విష‌యం తెల‌సుకున్న మాధురీ దీక్షిత్‌ డ్యాన్స్‌ దీవానీ 3 టీం తరపున రూ.5 లక్షల చెక్‌ అందించింది. సవితా బజాజ్‌కు కూడా ఎవరైనా చేయూత అందిస్తే బాగుండ‌ని ఆమె అభిమానులు ప్రార్ధిస్తున్నారు.