Sarkaru: ‘సర్కారు వారి పాట’ యూనిట్ లో విషాదం..

Sarkaru: ప్రిన్స్ మహేష్ బాబు, ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా యూనిట్ లో విషాదం అలుముకుంది. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వట్టి కుమార్ (38) కరోనా వైరస్ సోకి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బండి వీధికి చెందిన ఇతను అదే జిల్లాలోని రాగోలులో ఉన్న ‘‘గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్’’(జెమ్స్)లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం అకాల మరణం పొందాడు.

‘మా అబ్బాయి’కి డైరెక్టర్..

పదేళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వట్టి కుమార్ తొలుత ఎడిటర్ గా అరంగేట్రం చేశాడు. తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు పిక్చర్లకు పనిచేశాడు. బలగ ప్రకాష్ నిర్మించిన ‘మా అబ్బాయి’ ఫిల్మ్ కి దర్శకుడిగా వ్యవహరించాడు. 2017లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు. వట్టి కుమార్ కి ఇద్దరు సోదరీమణులు. ఇతని తండ్రి సూర్యలింగం కూడా రెండేళ్ల కిందట అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. వట్టి కుమార్ కి ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో ఇలా జరగటంతో నరసన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

షూటింగ్ వాయిదా..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ని ప్రస్తుతం నిలిపేశారు. ఈ నేపథ్యంలో వట్టి కుమార్ కి పాజిటివ్ అని తేలింది. అనంతరం ఆరోగ్యం క్షీణించింది. వట్టి కుమార్ చనిపోవటం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల ఎమోషనల్ గా స్పందించారు. ‘కొవిడ్-19తో దూరమైన ఆత్మీయుడు వట్టి కుమార్ కి దు:ఖ విచలిత నేత్రాలతో ఆల్విదా. అమానవీయ రాజకీయ సందర్భాన ఈ నేలనేలంతా వల్లకాడై వలపోత చరిత్రని మిగిలిస్తోంది. మన పుణ్య భూమి ముఖచిత్రంపై ఒక్కో మరణం ఒక్కో విషాద వాఖ్యముగా పరివ్యాప్తం అవుతుంది’ అని ట్విట్టర్ లో రాశారు.

Advertisement