PAWAN KALYAN: ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అక్క‌డ క‌మ‌ల్ హాస‌న్.. ఇద్ద‌రిది ఒకే ప‌రిస్థితి!

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం విరివిగా జరుగుతుంది. కానీ వాళ్ళు విజయం సాధించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడప్పుడో ఎన్టీఆర్.. ఆ తర్వాత ఎంజీఆర్.. మధ్యలో జయలలిత వీళ్లు మాత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పారు. వీళ్ళను చూసి చాలా మంది సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల చేత తిరస్కరించబడ్డారు. ఈ జాబితాలోకి కమల్ హాసన్ కూడా చేరిపోయాడు. తాజాగా వెలువడిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే విజయదుందుభి మోగించింది. స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏకంగా 152 సీట్లు సొంతం చేసుకొని గవర్నమెంట్ ఫాం చేయబోతుంది.

మరోవైపు పళని స్వామి అధ్యక్షతన అన్నాడీఎంకే 82 సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఈ ఇద్దరి మధ్యలో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అంటూ తన పార్టీతో ప్రజల ముందుకు వెళ్ళాడు. సినిమా షూటింగులు వదిలేసి రాష్ట్రమంతా తిరిగాడు.. బాగానే ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో ఏమి ప్రభావం చూపించలేకపోయారు. కనీసం ఆయనకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఆయన నిలబడిన కోయంబత్తూర్ సీటు కూడా బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. కమల్ హాసన్ పరాభవం చూసిన తర్వాత ఏపీలో పవన్ కల్యాణ్ కు ఎదురైన ఘోర పరాజయం గుర్తురాక మానదు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీకి కూడా దాదాపు అదే పరిస్థితి ఎదురైంది. అయితే ఇద్దరిలో ఒకే తేడా ఉంది. జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. కమల్ హాసన్ కు ఆ సంతృప్తి కూడా మిగలలేదు. ఇటు పవన్ కళ్యాణ్ అటు కమల్ హాసన్ ఇద్దరు సినిమాలలో దిగ్గజాలు. ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లల్లో ఉంది. కానీ రాజకీయాల్లో అవి పనికి రాలేదు. ప్రజలు వీళ్లను సినిమా హీరోలు గానే చూశారు కానీ రాజకీయ నాయకులుగా నమ్మలేదు. అందుకే వాళ్ల పార్టీలకు ఓట్లు వేయలేదు. ఏదేమైనా కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇద్దరే అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్లిద్దరిపై నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఘోర పరాజయాన్ని కమల్ హాసన్ ఎలా తీసుకుంటారో చూడాలి.

Advertisement