Samantha: అంత పేరొచ్చిన సెల‌బ్రేష‌న్ చేసుకోలేని ప‌రిస్థితిలో స‌మంత‌

Samantha: చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత అక్కినేని.. ఈ మధ్యే ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా సమంత పోషించిన శ్రీలంకన్ రెబల్ రాజి పాత్రకు అద్భుతమైన స్పందన వస్తుంది.

తొలి సీజన్లో హీరో మనోజ్ బాజ్పాయ్ కి పోటీగా ధీటైన పాత్ర ఒకటి కూడా లేదు. కానీ రెండో సీజన్లో సమంత అక్కినేని ఆయనకు ధీటుగా నిలబడింది. ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు సమంత నటనను పొగడకుండా ఉండలేక పోతున్నారు. అంత అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటుంది సమంత అక్కినేని. అయితే ఇలాంటి సంతోషకర సమయంలో కూడా అక్కినేని కోడలు ఆనందంగా లేదు.

ఒక ముక్కలో చెప్పాలంటే ఈమె తనకు వచ్చిన అంత పెద్ద విజయం కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోలేక పోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికీ కొందరు కోపంతో రగిలిపోతున్నారు. దానికి కారణం శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఈ సిరీస్ లో చూపించడమే. శ్రీలంకన్ రెబల్స్ LTTE వర్గాన్ని చూపించిన తీరు కొంతమందికి అసలు నచ్చడం లేదు.

వాళ్లు తీవ్రవాదులు కాదని అలాగే ఈ సిరీస్ లో చూపించినట్లు బయట ఉండదని.. ఇలాంటి రెచ్చగొట్టే సినిమాలు వెబ్ సిరీస్ లు తీయడం సమాజానికి మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. మరికొందరు బ్యాన్ చేయాలి అంటూ గొడవ చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంత పాత్రను అందరూ పొగుడుతూ ఉంటే.. కొందరు మాత్రం తమిళ అమ్మాయి అయి ఉండి ఇలాంటి పాత్ర చేయడానికి సిగ్గులేదా అంటూ సోషల్ మీడియాలో బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కానీ చేసుకుంటే వివాదం మరింత ముదిరిపోతుందని భావించిన సమంత ఈ సక్సెస్ మనసులోనే దాచుకుంటుంది కానీ బయటకు చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో తన సినిమాల గురించి ఎప్పుడు ప్రమోషన్ చేసే సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి మాత్రం యాక్టివ్ గా లేదు. మొక్కుబడిగా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో చెరో పోస్ట్ పెట్టి చేతులు దులిపేసుకుంది. ఏదేమైనా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత కూడా అనుకోని వివాదాలు ఈమెను చుట్టుముడుతున్నాయి.