Salman Khan: స‌ల్మాన్ భార్య దుబాయ్‌లో ఉందా, అత‌నికి 17 ఏళ్ల కూతురు ఉంద‌ని ప్ర‌చారం

Salman Khan బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒక‌రు. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న ఆయ‌న ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో స‌ల్మాన్ సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. త‌న ఫాం హౌజ్ నుండే స‌ల్మాన్ సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు పెళ్లిళ్లు చేసుకొని మంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండ‌గా, స‌ల్మాన్ ఖాన్ మాత్రం ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు. అయితే ఆయ‌న ప‌లువురు హీరోయిన్స్‌తో ఎఫైర్స్ పెట్టుకున్నాడ‌నే వార్త‌లు మాత్రం జోరుగా సాగుతుంటాయి. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ పర్సనల్ స్టైలిష్ట్ ఆష్లే రెబెల్లో కత్రినా పుట్టినరోజు సందర్భంగా ‘భారత్’ సినిమాలో ఆమె వెడ్డింగ్ గౌను వేసుకున్న పిక్ పోస్ట్ చేసి విషెస్ చెబుతూ.. ‘త్వరలో ఇది నిజమవ్వాలని కోరుకుంటున్నాను’ అని కామెంట్ చేశాడు

ఆ పోస్ట్‌కి క‌త్రినా స్పందిస్తూ థ్యాంక్యూ అని స‌మాధానం చెప్పింది. దీంతో క‌త్రినా.. స‌ల్మాన్ ఖాన్‌ని పెళ్లి చేసుకోనుందా అనే ప్ర‌చారం మొద‌లైంది. మ‌రోవైపు స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ పించ్ అనే టాక్ షో మొద‌లు పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ షో రెండో సీజ‌న్ న‌డుస్తుండ‌గా, తొలి ఎపిసోడ్ జూలై 21న స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ షోలో సోషల్ మీడియాలో తమ మీద వచ్చినటువంటి ట్రోల్సింగ్స్‌ గురించి సెలబ్రిటీలు సమాధానం చెప్పడం ఉంటుంది.

షోకు తొలి అతిథిగా స‌ల్మాన్ ఖాన్‌ని ఆహ్వానించాడు అర్భాజ్. ఇక షోలో సల్లూ భాయ్ వయసు, సినిమాలు, జీవితం మీద వచ్చిన గాసిప్స్ గురించి ప్ర‌శ్నించ‌గా,ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చాడు. అయితే ఓ నెటిజ‌న్ సల్మాన్‌కు దుబాయ్‌లో నూర్‌ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నిజమేనా అని ప్రశ్నించాడు అర్భాజ్.

అర్భాజ్ ఖాన్ ప్ర‌శ్న‌కు స్పందించిన స‌ల్మాన్ ఖాన్.. ఈ జనాలకు సమాచారం బాగానే అందుతుంది. కానీ అసలివి నాకు సంబంధంలేని విషయాలు. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. దీనికి నేను సమాధానం చెప్పాలని వారు అనుకుంటున్నారా. నాకు భార్య లేదు, నేను హిందూస్తాన్, గెలాక్సీ అపార్టుమెంటులో నివసిస్తున్నాను. నా తండ్రి కూడా నా పై ఇంటిలో నివసిస్తున్నారు. ఇది భారత్‌లో అందరికీ తెలిసిన విషయం’. అని బదులిచ్చాడు.

మ‌రో ప్ర‌శ్న‌లో భాగంగా స‌ల్మాన్ నకిలీ వ్య‌క్తి అని ఓ నెటిజ‌న్ ఆరోపించ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన స‌ల్లబాయ్.. ఆ వ్య‌క్తికి నేను ఏ యాంగిల్‌లో న‌కిలీగా క‌నిపించానో, ఒకవేళ తన భార్య నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి లేదా తన కూతురు నా సినిమా చూపించాలని పట్టుబట్టి ఉంటారని సరదాగా సమాధానమిచ్చాడు.

షో మొత్తం చాలా ఆస‌క్తిక‌రంగా సాగ‌గా ఇది స‌ల్మాన్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ కండ‌ల వీరుడు ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.