RRR: ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ.. 2021లో దసరాకి రాదంట. 2022లో సంక్రాంతికంట?..

RRR: ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఈ ఏడాది దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2021 అక్టోబర్ 13ని రిలీజ్ డేట్ గా ఇప్పటికే ప్రకటించేశారు కూడా. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇచ్చినా మధ్యలో ఈ కరోనా వైరస్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అన్నట్లు పరిస్థితి తయారవుతోంది. కొవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే మూడో కన్ను తెరుస్తోంది. దీంతో సినిమా థియేటర్లు వాటంతటవే మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ఇంకా ‘లాక్డౌన్-2’నే ప్రకటించలేదు. అది గనక అమల్లోకి వస్తే ‘అన్ లాక్డౌన్-2’ ఎప్పుడు చేస్తారో ఆపైవాడికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ యూనిట్ కూడా పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

వచ్చేది.. వచ్చే ఏడాదే..

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ని 2021లో దసరా పర్వదినానికి కాకుండా 2022లో సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని సంబంధిత వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. కరోనాను చూసి ఎన్నో చిత్రాలు వెనకడుగు వేసిన విషయం విధితమే. కాబట్టి మనం కూడా కాస్త వెనకా ముందు ఆలోచిస్తే బెటర్ అని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. సినీ మహల్స్ పున:ప్రారంభం అయినప్పటికీ ప్రేక్షక మహాశయులు పిల్లాపాపలతో సకుటుంబ సపరివార సమేతంగా తరలివస్తారనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు తొందరపడకు సుందర వదనా అని ‘ఆర్ఆర్ఆర్’ పరివారం అనుకుంటున్నట్లు చిత్రసీమ గుసగుస. దసరా తర్వాత పెద్ద పండుగలేవీ పెద్దగా లేవు. దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్ వంటివి ఉన్నా ఆయా పండుగల వాతావరణాలు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చలన చిత్రాలకు సరిపోవు. కాబట్టి సంక్రాంతే సరైన ముహూర్తమని మెజారిటీ అభిప్రాయంగా చెబుతున్నారు.

బోనీ కపూర్ హ్యాపీ..

ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని 2022 సంక్రాంతికి తీసుకురావాలని డిసైడ్ అయితే ఇప్పటికే ఆ ఫెస్టివల్ ని టార్గెట్ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు ‘సర్కారువారిపాట’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ పిక్చర్లు మరింత వెనక్కి పోతాయని అంచనా వేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ (2021 అక్టోబర్ 13) రద్దు అయితే ముందుగా సంతోషించేది శ్రీదేవి భర్త బోనీ కపూరే. ఎందుకంటే ఆయన నిర్మిస్తున్న, అజయ్ దేవ్ గణ్ హీరోగా నటిస్తున్న ‘మైదాన్’ సినిమా విడుదల తేదీ కూడా అదే నెలలో 15వ తేదీ. ఈ విషయమై ఇప్పటికే ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఆ గొడవ ఇలా సద్దుమణగబోతున్నదన్నమాట. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చూపుతుంది అంటే ఇదే.

Advertisement