RRR: ఉగాదికే ఆర్ఆర్ఆర్..అక్టోబ‌ర్‌లో లేన‌ట్టే!

RRR: ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే అనేక మార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప‌క్కా విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని ప‌రిస్థితులు చూస్తే పూర్తిగా మారిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్ర‌మోష‌న్స్ కారణంగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కావడం కష్టమేనని నిర్ణయించుకున్న మేకర్స్ వచ్చే ఏడాదికి ఉగాదికి విడుదలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు ఫిక్స్ అయిపోగా ఇప్పుడు వాటిని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేకనే సంక్రాంతి బరిలో కాకుండా ఉగాదికి తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడ రానుంద‌ట‌.

బాహుబలితో రాజమౌళి సత్తా రుచి చూసిన దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి ఇద్ద‌రు స్టార్ హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. క‌రోనా మహమ్మారి లేకుంటే త్వరగానే ఆర్ఆర్ఆర్ సందడి మొదలయ్యేది. కాని కరోనా దెబ్బకు ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంది.

చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇటీవల ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. భారీ సాంగ్ షూట్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు ఆర్ఆర్ఆర్ టీం ఉక్రెయిన్ వెళ్ళింది. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, టీం అంతా తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉందట‌.