ROMANTIC : పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడికి కూడా క‌ష్టాలు త‌ప్పేలా లేవు..!

ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. రవితేజ లాంటి హీరోలు ఈయన వల్లే స్టార్స్ అయ్యారు. అలాగే చాలామంది హీరోలకు అవసరమైన టైంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. మహేష్ బాబు పోకిరి సినిమాతోనే సూపర్ స్టార్ అయ్యాడు. అలా ఇండస్ట్రీలో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు తన కొడుకుకు అవసరమైన విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన నటించిన తొలి సినిమా మెహబూబా ఫ్లాప్ అయ్యింది.

పూరీ జగన్నాథ్ ఈ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇండియా-పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన మెహబూబా అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. దాంతో ఆకాష్ కెరీర్ అక్కడే ఆగిపోయింది. ఈ సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా రెండో సినిమాను విడుదల చేయలేదు ఆకాష్ పూరి. ప్రస్తుతం ఈయన రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందిస్తున్నాడు. ఆయన శిష్యుడు అనిల్ పడూరీ రొమాంటిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2019 లోనే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా 2021 వచ్చిన ఇంకా విడుదల కాలేదు.

మధ్యలో కరోనాతో బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత కూడా ఈ సినిమాకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దాంతో రొమాంటిక్ ఆగిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. కానీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి ఒక ప్రకటన వచ్చింది. మార్చి 1న రొమాంటిక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కానీ అప్పుడు కూడా చేయలేదు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఒక బీచ్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా పోస్టర్స్ పై విమర్శలు కూడా వచ్చాయి. మహిళా సంఘాలు గోల గోల చేశారు. ఏదైనా కూడా ఈ సినిమాతో తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు పూరి జగన్నాథ్. రొమాంటిక్ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.