Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్‌ మూవీ రివ్యూ

Republic Movie Review: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఐశ్వర్య రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, ర‌మ్య‌కృష్ణ‌వంటి న‌టీన‌టులు ఇందులో భాగం కావ‌డంతో మూవీపై భారీ హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం, ట్రైల‌ర్‌ని చిరంజీవి విడుద‌ల చేయ‌డంతో అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్థానం’ వంటి పొలిటికల్ డ్రామాను రక్తికట్టించిన దేవ్ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Republic Movie Review and Rating
Republic Movie Review and Rating

క‌థ‌:

1970లో ప్ర‌ఖ్యాతగాంచిన తెల్లేరు స‌ర‌స్సు.. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత క‌బ్జాకు గుర‌వుతుంది. దానిని రాజ‌కీయ ప్రాబ‌ల్యం ఉన్న వ్య‌క్తులు ఆక్ర‌మించుకోవ‌డంతో పాటు అందులో చేప‌ల‌కు విషాహారం వేయ‌డంతో దాని ద్వారా ఏర్ప‌డిన వైర‌స్ అంత‌టా పాకుతుంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది. తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన పంజా అభిరామ్ (సాయి తేజ్) రాజకీయ నాయకురాలు విశాఖ వాణికి ఎలా బుద్ధి చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ఈ చిత్ర కథ.

Republic Movie Review and Rating
Republic Movie Review and Rating

న‌టీన‌టుల న‌ట‌న‌:

వ్య‌వ‌స్థ‌లోని లోటుపాట్ల‌ని త‌నదైన శైలిలో చక్క‌గా చూపించాడు దేవ్ క‌ట్టా. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్ళ మీద తాను నిలబడే వ్యక్తిగా అభిరామ్ పాత్రలో సాయి తేజ్ అద‌ర‌గొట్టాడు. అదే సమయంలో అతని తండ్రి దశరథ్ (జగపతిబాబు) ఎందుకు అవినీతి పరుడుగా మారాడో చూపించగా, ఆ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. అన్నయ్యను వెత్తుకుంటూ విదేశాల నుండి వచ్చిన యువతి మైరా (ఐశ్వర్యా రాజేశ్) పాత్రకు న్యాయం చేసింది క‌థానాయిక‌.

ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ ఫుల్ పాత్రను ఇందులో పోషించింది. కరడుకట్టిన పొలిటికల్ లీడర్ గానే కాకుండా క్లయిమాక్స్ లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెలిబుచ్చిన ఆవేదన హృదయానికి హత్తుకుంటుంది. ఆటో డ్రైవర్ మణిగా రాహుల్ రామకృష్ణ కనిపించేది కాసేపే అయినా గుర్తుండి పోయే పాత్ర చేశాడు. జగపతిబాబు భార్యగా ఆమని, ఆమె కూతురుగా చేతన నటించారు. సుబ్బరాజు కలెక్టర్ గా, శ్రీకాంత్ అయ్యంగార్ ఎస్పీగా, మనోజ్ నందన్ ఎస్.ఐ.గా ఆయా పాత్రలలో మెప్పించారు.

Republic Movie Review and Rating
Republic Movie Review and Rating

టెక్నీషియ‌న్స్: చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం కాకుండా క‌థ‌, మాట‌లు అందించిన దేవ్ క‌ట్టా తాను రాసుకున్న దానిని చక్క‌గా ప్ర‌జెంట్ చేశాడు. పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేంది.మ‌ణిశ‌ర్మ‌సంగీతం అదిరిపోయింది. ఇందులో మూడే పాటలున్నాయి. వాటిని సుద్దాల అశోక్ తేజ్, రెహమాన్ రాశారు. అన్నీ సందర్భానుసారంగా వచ్చేవే. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, కె. రవికుమార్ యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్. నిర్మాణ విలువలూ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

  • ఎంచుకున్న పాయింట్
  • ప్రధాన తారాగణం నటన
  • ఆలోచింప చేసే మాటలు
  • నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్స్

  • సరస్సు చుట్టూనే కథ తిరగడం
  • నిరాశ పరిచే క్లయిమాక్స్

విశ్లేష‌ణ‌: రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, మెగాభిమానులకు, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది.

చివ‌రిగా: రాజ‌కీయాల‌లోని అవినీతిని క‌ళ్ల‌కుగ‌ట్టిన‌ట్టు చూపించే చిత్రం

రేటింగ్ : 3 / 5